07-10-2025 01:16:40 AM
ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిబంధనలు అమలు చేస్తున్నామని ప్రకటన
ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
లక్నో, అక్టోబర్ ౬(విజయక్రాంతి): శ్రీషాన్ ఫార్మా కంపెనీ తయారుచేసిన కోల్డ్రిఫ్ దగ్గుమందును నిషేధిస్తూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు తాగి 14 మంది చిన్నారులు మృతిచెందడంతో అప్రమత్తతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాష్ట్రంలోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు ఆదివారం పలు మార్గదర్శకాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ సంస్థల నుంచి శ్రీషాన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన కోల్డ్రిప్ దగ్గుమందు శాంపిల్స్‌ను సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశా లు వచ్చేవరకు రాష్ట్రంలో కోల్డ్రిప్ దగ్గుమందును ఇక నుంచి దిగుమతి చేసుకోవడం, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడం కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.
ప్రజాప్రయోజనాల దృష్ట్యా కఠిన నిబంధనలు అమలు చేస్తు న్నామని తెలిపారు. ఒకవేళ ఎవరైనా తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య రక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఔషధాల సరఫరాపై నిఘా పెడుతున్నామని చెప్పారు.