26 August, 2026 | 4:44 AM

హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌పై హత్యాయత్నం?

26-08-2026 12:57 AM

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ 

రంగారెడ్డి, ఆగస్టు 25: హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ తాను ఇంటి ముందు రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యాయత్నం వెలుగులోకి వచ్చింది. అనంతరం పట్టుబడిన వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు అప్పజెప్పారు.

ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులకు తనకు రక్షణ కల్పించాలని, తనపై హత్యకు కుట్ర చేసిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన్సూరాబాద్ లో తాను రేషన్ షాపు నిర్వహిస్తుండగా మంగళవారం నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు గంట సమయం పాటు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని అన్నారు. 

వారిని తన అనుచరులు కలిసి నలుగురు వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఒకరు పట్టుబడ్డగా, ముగ్గురు పరారైనట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని విచారించగా తన పేరు గార్లపాటి అరవింద్ రెడ్డి అని, తనను శివ చరణ్ రెడ్డి పంపించాడని, ఎల్బీనగర్ పోలీసుల ఎదుట చెప్పాడు. కొన్ని రోజులుగా బుడ్డా సత్యనారాయణతో శివచరణ్ రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి మధ్యన వివాదం ఉన్నది. ఇందులో భాగంగా సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా, తనపై హత్యాయత్నానికి కుట్ర పన్నినవారిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని బుడ్డా సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.