రాహుల్ కుటుంబానికి న్యాయం చేస్తా..
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హామీ
జవహర్‌నగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింహాద్రి నగర్ చంద్రగిరి కాలనీకి చెందిన 21 ఏళ్ల దివ్యాంగుడు రాహుల్ కు ప్రభుత్వ నుంచి సాయం అందేలా ప్రయత్నిస్తానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.
రాహుల్ జన్మించినప్పటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతూ వీల్ చైర్ కే పరిమితమై ఉండగా తన కుమారుడి వైద్యం కోసం ఎన్నో సంవత్సరాలుగా తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు గూర్చి స్పందించిన తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ మల్కాజ్గిరి బిఆర్‌ఎస్ సీనియర్ మహిళ నాయకురాలు లక్ష్మి ఆనంద్ చొరవతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులను అర్థం చేసుకున్నానని మానవతా దృక్పథంతో రాహుల్ కు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసే విషయమై కలెక్టర్ తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తానని తెలిపారు.
అలాగే రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తక్షణమే రిక్వెస్ట్ లెటర్ ను అందజేసి కలెక్టర్ కు ఫోన్ చేసి రాహుల్ గురించి వివరించగా కలెక్టర్ సానుకూలంగా స్పందిం చాలని తెలిపారు. ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగులు పేదలు నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ముందుండి పనిచేస్తున్నారని రాహుల్ వంటి దివ్యాంగుడికి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తే అతని కుటుంబానికి ఎంతో ఊరట లభిస్తుంది అన్నారు.
రాహుల్ కు ప్రభుత్వం అండగా నిలవాలని వీల్ చైర్ కే పరిమితమైన రాహుల్ అతని కుటుంబ పరిస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని మానవతా దృక్పథంతో వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని మెరుగు శివకృష్ణ కోరారు. దివ్యాంగులకు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా గౌరవంగా జీవించేందుకు అవసరమైన నివాస వసతిని కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఉద్యమకారులు నర్సింగ్, వెంకన్న, రామ్ యాదవ్, పాత్రికేయులు చింతల విజయ్, రఘు తదితరులు పాల్గొన్నారు.






