డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో వాణిజ్య సముదాయాల వేలం
అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్, మార్చి 17 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 16 డబుల్ బెడ్ రూమ్ కాలనీ లలోని 992 వాణిజ్య సముదాయములను వేలం పద్ధతిలో విక్రయించడానికి మార్చి నెలాఖరు వరకు తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో డిప్యూటీ కమిషనర్స్, కాప్రా, నాచారం, దుండిగల్ , గాజులరామారం, అసిస్టెంట్ కమిషనర్ కీసర, నిజాంపేట్, సబ్ రిజిస్టర్ ఆఫీసు అధికారులు అలియాబాద్ ఘటకేసర్, కీసర, కుత్బుల్లాపూర్, కాప్రా , రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ పర్యవేక్షణ అధికారులు, ప్రాజెక్టు డైరెక్టర్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వారితో సమావేశమై డబుల్ బెడ్ రూమ్ కాలనీల సమీపంలో గల వాణిజ్య సముదాయాల చదరపు అడుగు విక్రయ ధర మార్కెట్ రేటును గమనించి ఆ ధరను కనీస ధరగా నిర్ణయించి 3% నుండి 10% కు ముందస్తూ హామీ సొమ్ము (ఈఎండి) జమ చేసేలా ప్రతి పాదనలు తయారు చేయవలసినదిగా ఆదేశించారు.
వాణిజ్య సముదాయములను విక్రయించగా వచ్చిన డబ్బును అదే కాలనీలోని పనుల కోసం మాత్రమే వినియోగించాలి అని నిబంధనలు ఉన్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ కన్వీనర్ గా, అడిషనల్ కలెక్టర్, పిడి హౌసింగ్ సభ్యులుగా ఉండే కమిటీ ద్వారా కనీస ధరను నిర్ణయించాలని సూచించారు.




