26-10-2025 12:48:00 PM
ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం పేరు మార్చబడిన మూడు సంవత్సరాల తరువాత ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా ఛత్రపతి సంభాజీనగర్ రైల్వే స్టేషన్ గా మార్చినట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. దీని కొత్త స్టేషన్ కోడ్ `సీపీఎస్ఎన్' అని సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోని నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం అక్టోబర్ 15న ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును మార్చడానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం అధికారికంగా ఔరంగాబాద్ నగరాన్ని ఛత్రపతి సంభాజీనగర్‌గా పేరు మార్చిన దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రతిపాదన వచ్చింది. గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉన్న ఈ నగరం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు, మరాఠా రాష్ట్ర రెండవ పాలకుడు ఛత్రపతి శంభాజీకి నివాళిగా కొత్త పేరును పొందింది. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ 1900లో హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ప్రారంభించబడింది. ఛత్రపతి శంభాజీనగర్ ఒక పర్యాటక కేంద్రం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన అజంతా గుహలు, ఎల్లోరా గుహలు వంటి అనేక చారిత్రక కట్టడాలు దాని చుట్టూ ఉన్నాయి.