26-10-2025 02:44:58 PM
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, రాబోయే 24 గంటల్లో నైరుతి దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 'తుఫాను'గా మారే అవకాశం ఉందని, గంటకు 10 కి.మీ వేగంతో కదులుతున్నందని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి మొంథా తుపానుగా నామకారణం చేశారు.
అక్టోబర్ 28న కాకినాడ చుట్టూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంటకు 10 కి.మీ వేగంతో దాదాపు పశ్చిమ-ఉత్తర దిశగా కదిలి, అక్టోబర్ 26న తీవ్ర వాయుగుండంగా మారింది. పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమాన 610 కి.మీ, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 790 కి.మీ, విశాఖపట్నంకు దక్షిణ-ఆగ్నేయంగా 850 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 840 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 950 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.
తమిళనాడు, పుదుచ్చేరి మరియు కారైకల్ ప్రాంతాలలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. గత 24 గంటల్లో తిరునల్వేలిలోని నలు ముక్కులో గరిష్టంగా 13 సెం.మీ, ఊతులో 12 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ కార్యాలయం తెలిపింది. చెన్నైలోని నెర్కుండ్రంలో అత్యల్పంగా 1 సెం.మీ వర్షపాతం నమోదైంది.
2025 అక్టోబర్ 26 నుంచి 28 మధ్య మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, లోతైన సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించారు. చెన్నై దాని పరిసర జిల్లాలకు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.