26-10-2025 01:24:37 PM
- ఐదుగురు నిందితుల అరెస్ట్
- ఎర్టిగా కారు, రూ 20 వేల నగదు స్వాధీనం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్ తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్ భార్య అమృత ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలను ముమ్మరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఏసిపి వెల్లడించిన వివరాల ప్రకారం... మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్ అల్లం శ్రీను, ఇప్ప భూమయ్య అనే వ్యక్తులతో కలిసి తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామంలో 42 ఎకరాల భూమికి నకిలీ పత్రాలు సృష్టించి పులి మడుగు గ్రామానికి చెందిన బండి సాగర్ అనే వ్యక్తికి అమ్మేందుకు రూ 80 లక్షలు బయానాగ తీసుకున్నట్లు చెప్పారు. గోమాస శ్రీనివాస్ నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మే ప్రయత్నం చేశాడని తెలియడంతో బండి సాగర్ అతనితోపాటు అల్లం శ్రీను, ఇప్ప భూమయ్య లపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్లు చెప్పారు. బండి సాగర్ కు డబ్బులు ఇచ్చేందుకు రెండు నెలల గడువు కోరినట్లు తెలిపారు. ఎందుకు ప్రామిసరీ నోట్, చెక్కులు కూడా ఇచ్చినట్లు తెలిపారు.
గడువు ముగిసిన డబ్బులు ఇవ్వకపోవడంతో గోమాత శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసి రూ 80 లక్షలు వసూలు చేయాలని అనుకున్న బండి సాగర్,గొల్ల సంపత్ అనే వ్యక్తి ద్వారా లింగాపూర్ గ్రామానికి చెందిన మైలారపు భీమేష్ తో కిడ్నాప్ చేసేందుకు రూ 2 లక్షల 40000 కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మైలారపు భీమేష్ ఈ విషయాన్ని తన స్నేహితుడు అయిన బెల్లంపల్లికి చెందిన సాదిక్ కు తెలపడంతో సాగర్ ద్వారా తాను గోమాస శ్రీనివాస్ కు భూమి విషయంలో ఇచ్చిన రెండు లక్షల రూపాయలు పొందేందుకు కిడ్నాప్ చేయాలని భీమేష్ కు తెలిపినట్లు చెప్పారు.
ఈ క్రమంలో ఈనెల 19న పులిమడుగు గ్రామానికి చెందిన బండి సాగర్ ఇందుకోసం సంపత్ అనే వ్యక్తికి రెండు లక్షల రూపాయలు ముందుగా ఇవ్వడంతో సంపత్ మైలా రపు భీమేష్ కు రూ 20,000, సాదిక్ కు రూ 10,000 ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 20న బండి సాగర్ మైలారపు భీమేష్ కు గోమాస శ్రీనివాసును కిడ్నాప్ చేసేందుకు తన ఎర్టిగా కారును ఇచ్చినట్లు తెలిపారు. మైలారపు భీమేష్, సాదిక్ లు కాపుగాసి ఈనెల సాయి తేజ అనే డ్రైవర్ సహాయంతో ద్విచక్ర వాహనంపై బెల్లంపల్లి పోచమ్మ గడ్డ వద్ద కనిపించిన మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్ ను కారుతో వెంబడించి ఐటీడీఏ పూల తోట వద్ద కిడ్నాప్ చేసినట్లు తెలిపారు.
నిందితులు గోమాస శ్రీనివాస్ ను కారులో ఎక్కించుకొని స్థానిక శివాలయం మీద దహేగాం, కాగజ్నగర్ వైపు నుండి ఆసిఫాబాద్ తీసుకెళ్లి అక్కడి నుండి వాంకిడి, రాజురా, ఆదిలాబాద్, హైదరాబాద్ పరిసరాల్లోకి తీసుకెళ్లినట్లు తెలిపారు. బండి సాగర్ కు చెల్లించాల్సిన రూ 80 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని గోమాస శ్రీనివాస్ ను బెదిరించినట్లు చెప్పారు. శుక్రవారం ఎర్టిగా కారులో గోమాస శ్రీనివాస్ తో పాటు నిందితులు జన్నారం వైపు వస్తున్నారన్న సమాచారం అందడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేసి జన్నారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఎర్టిగా కారును పట్టుకున్నట్లు చెప్పారు.
గోమాస శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసిన నిందితులు మైలారపు భీమేష్, సాదిక్, కారు డ్రైవర్ సాయితేజ లతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఏసిపి రవికుమార్ వెల్లడించారు. వీరి వద్ద నుండి ఎర్టిగా కారుతోపాటు రూ 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.24 గంటల్లోనే కిడ్నాప్ కేసును చేదించిన బెల్లంపల్లి రూరల్ సీఐ హనూక్, తాళ్లగురిజాల, నెన్నెల్ , కన్నెపల్లి , భీమినిఎస్సైలు ప్రసాద్, బండి రామకృష్ణ, భాస్కర్ రావు, విజయ్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మోసగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి: బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్
భూముల క్రయ విక్రయాల వ్యవహారంలో మోసగాళ్లపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి ఏసిపి ఏ .రవికుమార్ సూచించారు. భూములు కొనుగోలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు అధికారులతో సంప్రదించాలని సూచించారు. గ్రామాలలో నాయకులుగా చలామణి అవుతూ పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేసి డబ్బులు గుంజుతూ కొంతమంది రౌడీయిజం చేస్తున్నారని, వారు తమ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. పేద ప్రజలను మోసం చేసే వ్యక్తులపై నిఘా పెట్టినట్లు తెలిపారు నకిలీ భూమి పత్రాలు సృష్టించి పలువురిని మోసం చేయడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన బట్వాన్పల్లి గ్రామానికి చెందిన బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు రామటెంకి హరికృష్ణ లపై షీట్ ఓపెన్ చేయనున్నట్లు చెప్పారు.