13 August, 2026 | 6:16 AM

ఫ్రిజ్‌లో మంటలు.. తప్పిన ప్రమాదం

13-08-2026 12:35 AM

బాలాజీనగర్‌లో ఇంటికి తాళం వేసి ఉండగా అగ్నిప్రమాదం 

సకాలంలో స్పందించిన కాంగ్రెస్ నాయకుడు గుండ్ల మహేందర్ రెడ్డి 

జిన్నారం/అమీన్‌పూర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): సీఎంసి అమీన్ పూర్ సర్కిల్ బొల్లారం డివిజన్ 272 పరిధిలోని బాలాజీ నగర్ లో బుధవారం ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ నుంచి మంటలు చెల్లరేగి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాలాజీ నగర్ కి చెందిన రాంప్రసాద్, మానస దంపతులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ఫ్రిజ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని సామాగ్రికి మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో ఇల్లు మొత్తం నిండిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండ్ల మహేందర్ రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఇంట్లోకి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం ఫ్రిజ్ ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.

దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించకుండా నివారించగలిగారు. ఈ సందర్భంగా గుండ్ల మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు సెల్ ఫోన్ లలో ఫోటోలు, వీడియో తీస్తూ చూస్తూ ఉండటం కాకుండా సాధ్యమైనంత త్వరగా స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో పాటు ప్రమాద తీవ్రతను తగ్గించిన గుండ్ల మహేందర్ రెడ్డిని బాలాజీ నగర్ స్థానిక ప్రజలు అభినందించారు.