8 March, 2026 | 12:03 AM

పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన సదస్సు

07-03-2026 09:55 PM

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి పట్టణంలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో శనివారం పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఎంఈడిఎఫ్ఓ హైదరాబాద్, జిల్లా ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ సెంటర్  వనపర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అధికారులు లబ్ధిదారులకు పీఎం విశ్వకర్మ పథకం గురించి వివరంగా తెలియజేసి, వారికి ఉన్న పలు సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు, రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు.

విశ్వకర్మ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ లబ్ధిదారులు తమకు ఎదురయ్యే సమస్యలు లేదా అప్లికేషన్‌లోని లోపాలను సరిచేసుకోవడానికి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సంప్రదిస్తే సహాయం అందిస్తామని తెలిపారు. విశ్వకర్మ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందాలని, సంప్రదాయ వృత్తుల్లో ఉన్న వారు ఈ పథకం ద్వారా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ అవగాహన సదస్సులో పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జ్యోతి, డీపీఎం నాగమల్లిక, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్  పాండురంగం, డిఆర్డిఏ  సూపరింటెండెంట్ ప్రభాకర్, పరిశ్రమల శాఖ ఐపివో నాగేష్, ఎస్ఎంఈడిఎఫ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గురుస్వామి, ఈడీసీ మేనేజర్ శ్రీకాంత్, అసిస్టెంట్ మేనేజర్ హైమావతి పాల్గొన్నారు.