4 June, 2026 | 1:33 AM

మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించాలి

04-06-2026 12:46 AM
  1. డీజీపీ సీవీ ఆనంద్
  2. ప్రతి ఏడాది డిసెంబర్‌లో పోలీస్ అధికారుల రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తాం
  3. నాణ్యమైన పోలీస్ శిక్షణ కోసం సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి
  4. రోడ్డు భద్రత ప్రమాదాలపై ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి
  5. తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించిన డీజీపీ 

రాజేంద్రనగర్ జూన్ 3 (విజయక్రాంతి): మాదకద్రవ్యాలు. సైబర్ నేరాల నియంత్రణ .రోడ్డు భద్రత . ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని తెలంగాణ డిజిపి సీవీ ఆనంద్ రాష్ట్ర పోలీసు అధికారులకు పిలుపునిచ్చారు . తెలంగాణ రాష్ట్ర డి జి పి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీజీపీ సి.వి. ఆనంద్ బుధవారం హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకట రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించారు.

అకాడమీకి చేరుకున్న డీజీపీకి అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా డీజీపీ అకాడమీలోని యూనిట్ హాస్పిటల్, పరిపాలనా విభాగం, ఆడిటోరియం, తరగతి గదులు, మెస్లు, క్రీడా భవన్, ఫైరింగ్ రేంజ్, పరేడ్ గ్రౌండ్లు తదితర శిక్షణా, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అకాడమీ పనితీరు, శిక్షణా కార్యక్రమాలు, మౌలిక వసతులు, సంక్షేమ చర్యలు, సెమినార్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట్, ప్రాథమిక (ఇండక్షన్) మరియు సేవాకాల (ఇన్-సర్వీస్) శిక్షణా కార్యక్రమాలు, శిక్ష ణా ప్రణాళికలు, సంస్థాగత బాధ్యతలు, మౌ లిక వసతులు, అకాడమీ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమీక్ష అనంతరం మాట్లాడిన డీజీపీ సి.వి. ఆనంద్, దేశంలోని అత్యుత్తమ పోలీసు శిక్షణా సం స్థల్లో తెలంగాణ పోలీస్ అకాడమీ ఒకటిగా నిలిచిందని ప్రశంసించారు. నాణ్యమైన పోలీసు శిక్షణ కోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో జట్టుగా పనిచేయాలని సూచించారు.

పోలీసింగ్లో శిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు . జిల్లా శిక్షణా కేంద్రాలు సహా అన్ని శిక్షణా సంస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణా కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ఇతర సంస్థాగత అవసరాల విషయంలో ప్రధాన కార్యాలయం నుంచి పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే మాదకద్రవ్యాల నియంత్రణ (ఎన్డీపీఎస్), సైబర్ నేరాల దర్యాప్తు, మోటార్ వాహనాల చట్టం అమలు, రోడ్డు భద్రత, ప్రజల్లో అవగాహన కల్పన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ పోలీసు అధికారుల రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మహి ళా పోలీసు సిబ్బంది సంక్షేమం, సమాన అవకాశాలు, సంస్థాగత సంస్కరణల కోసం ‘తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ ఉమెన్ ఇన్ పోలీస్‘ కార్యక్రమాన్ని కూడా క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకాడమీకి చెందిన సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.