మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ
నిర్మల్ (విజయక్రాంతి): జూన్ 26 అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలపై వ్యతిరేక నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం.ఎ. రజాక్(District Excise Officer MA Razak) మాట్లాడుతూ... యువత మాదకద్రవ్యాల వైపు ఆకర్షితమవకుండా వారిలో చైతన్యం కల్గించాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబం, సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ శాఖ సిబ్బంది, పలువురు అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






