1 August, 2026 | 10:23 PM

బాలల రక్షణ అధికారులకు అవగాహన సదస్సు

01-08-2026 09:37 PM

ఆసిఫాబాద్,(విజయ,క్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ శారదాదేవి అధ్యక్షతన శనివారం కలెక్టరేట్ లో బాలల రక్షణ అధికారులకు  అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా శారదాదేవి మాట్లాడుతూ ఒక నాగరిక సమాజం తన పిల్లలను, ముఖ్యంగా ఆపదలో ఉన్న బాలలను ఎలా సంరక్షిస్తుందనే దానిపైనే ఆ సమాజం గొప్పతనం ఆధారపడి ఉంటుందని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లల అభివృద్ధి, రక్షణలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.సంకేత్ మిత్ర మాట్లాడుతూ... రాజ్యాంగంలోని అధికరణం 39(ఏ) ప్రకారం అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు. జూనియర్ సివిల్ జడ్జి అనంత లక్ష్మి జువెనైల్ జస్టిస్ చట్టం, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.

సంరక్షణ అవసరమైన బాలలు (CNCP) మరియు నేరానికి పాల్పడిన బాలలు (CCL) మధ్య ఉన్న తేడాలను వివరించారు.డీసీపీఓ బి. మహేశ్ బాలల హక్కులు, సంబంధిత చట్టాలపై వివరించగా, బాలల రక్షణ అధికారులు శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక భద్రత వంటి నాలుగు రకాల రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ సచ్చిదానంద్, ఎంఈఓలు, బాలల రక్షణ అధికారులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.