1 August, 2026 | 10:33 PM

ఎంజీఎం హైస్కూల్‌లో ఘనంగా బోనాల పండుగ

01-08-2026 09:59 PM

గణపురం,(విజయ క్రాంతి): మండలంలోని చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన బోనాల పండుగను పురస్కరించుకుని ముందస్తు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బోనాల కుండలను రంగురంగుల వస్త్రాలు, పూలు, వేపాకులు, పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించారు. పోతరాజుల విన్యాసాలు, డోలు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా సాగి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ, బోనాలు అంటే భోజనం అని, అమ్మవారికి నైవేద్యంగా ప్రత్యేక వంటలు సమర్పించడం తెలంగాణ ప్రజల ప్రధాన ఆచారమని తెలిపారు. ప్రజలు అంటువ్యాధులు దూరంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని ప్రార్థించడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ సాంప్రదాయాన్ని విద్యార్థులకు పరిచయం చేయడం ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు మధుకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.