1 August, 2026 | 10:33 PM

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరసనగా దిష్టిబొమ్మ దహనం

01-08-2026 09:57 PM

భూపాలపల్లి,(విజయక్రాంతి): భూపాలపల్లి, మంజునగర్‌లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓరుగంటి భగవాన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ యువత సామర్థ్యాన్ని తగ్గించి మాట్లాడడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత చేసిన త్యాగాలు ఎంతో గొప్పవని, అలాంటి యువతను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ఆలస్యమవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చదువుకునే విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

యువతే దేశ భవిష్యత్తు అని, వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భవిష్యత్తులో యువత హక్కుల కోసం మరింతగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణపతి, బీజేవైఎం నాయకులు సురేష్, రేగళ్ల వంశీ, చావాటి సంతోష్, వకటి రాజు, బిల్లా రాకేష్, సాధు దేవేందర్, సుధాకర్, హరీష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.