28 April, 2026 | 9:09 PM

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్రపై అవగాహన సదస్సు

28-04-2026 08:05 PM

దోమకొండ,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం, దోమకొండ ఫోర్ట్ విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం “గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర” అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ టీ. యాదగిరిరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. గ్రామాల్లో వసతుల కొరత వల్ల జరుగుతున్న వలసలను నివారించేందుకు సర్పంచులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

ఎన్‌ఐఆర్‌డీపీర్ శాస్త్రవేత్త డా. ఎం.వి. రవిబాబు మాట్లాడుతూ సర్పంచులకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన అవసరమని తెలిపారు. రైతుల అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS) వంటి సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని అన్నారు. లైవ్ ఎన్‌జీవో వ్యవస్థాపకులు బాలప్రసాద్ గ్రామాభివృద్ధిని యువత, విద్య, రైతులు, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలపై కేంద్రీకరించాలని సూచించారు.

సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ సి.హెచ్. ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుని నిష్పక్షపాతంగా అమలు చేయడం సర్పంచుల బాధ్యత అని తెలిపారు. పార్టీలు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డాక్టర్ జి శ్రీనివాస్  సర్పంచులు వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలో, అకౌంటింగ్ విధానాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను  లబ్ధిదారులకు ఏ విధంగా చేకూర్చాలో వివరించారు దోమకొండ సర్పంచ్ ఐరెని నరసయ్య ఈ తరహా అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.