గ్రామల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఉత్తమ్
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని అల్లీపురంలో రూ.12 కోట్లతో అమరవరం నుండి కొత్త తండా గ్రామ పంచాయతీ వరకు ఆర్ అండ్ బి డబుల్ రోడ్లకు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే.నరసింహతో కలసి రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... రాబోవు రోజుల్లో మఠంపల్లి మండలంలోని గ్రామాల అభివృద్దే లక్షంగా ప్రభుత్వం పని చేస్తుంది.
అలాగే కోదాడ,హుజూర్నగర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను కలుపుతూ తారు రోడ్లు వేయించడం జరుగుతుంది. గ్రామాలలో కొత్తగా వేసిన తారు రోడ్లపై వ్యవసాయ పనులు నిమిత్తం ట్రాక్టర్లకు బిగించిన ఫుల్ వీల్స్, ఆఫ్ వీల్స్ తిప్పరాదని,ఇలా తిప్పడం వలన రోడ్లు తొందరగా పాడైపోతాయని కావున గ్రామ ప్రజలు రోడ్లను కలకాలం ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. అలాగే అమరవరం లిఫ్ట్ నడిపించి పంట పొలాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహయ సహకారాలు ఉంటాయని వారు అన్నారు.
ఈ సంవత్సరం ఏలీనీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించినందున రైతులు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వ్యవసాయ శాఖ వారు సూచించిన సూచనలు విధంగా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, తాహశీల్దార్ హిమబిందు, ఆర్ అండ్ బి ఏఈఈలు, సర్పంచ్లు మాలోతు సక్రు నాయక్, బోగాల జ్యోతి పిచ్చి రెడ్డి, అరుణా దేశ్ పాండు నాయక్, అన్నెం శిరిష వీరినాగిరెడ్డి, అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు,గ్రామ శాఖ అధ్యక్షులు,ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






