ఎల్‌నినోతో వర్షాభావం ముప్పు
ప్రత్యామ్నాయ పంటలే మేలు
వరి తగ్గించాలి.. ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి
సిద్దిపేట రూరల్: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ఇప్పటి నుంచే పంటల ప్రణాళికను మార్చుకోవాలని అధికారులు సూచించారు. నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం–ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మండల ప్రత్యేక అధికారి రాజారామ్ మాట్లాడుతూ... సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో, అలాగే రానున్న యాసంగిలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. రైతులు వరి సాగును తగ్గించి కంది, పెసర, మినుము, ఆముదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.
నీటి సంరక్షణకు ప్రాధాన్యం
ఎంపీడీఓ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఫారం పాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్ పిట్లు, నీటి నిల్వ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
సబ్సిడీపై విత్తనాలు
మండల వ్యవసాయ అధికారి పరశురామ్ మాట్లాడుతూ రైతులకు కంది, పత్తి విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఆయిల్‌పామ్ సాగు దీర్ఘకాలికంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉందన్నారు. నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో అధిక దిగుబడి వచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లారెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, ఎంపీఓ, ఈజీఎస్ సిబ్బంది, హెచ్‌ఈఓ, ఏఈఓలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






