20 August, 2026 | 8:01 PM

ఆయిల్‌ ఫామ్ సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు

20-08-2026 07:30 PM

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్యాం ప్రసాద్

సుల్తానాబాద్,(విజయక్రాంతి); ఎల్ నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటున్నా నేపథ్యంలో రైతులు వరి సాగుకు ప్రత్నామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగును చేపట్టి దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చు అని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు, గురువారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండలంలోని వివిధ ఆయిల్‌పామ్ తోటలను ఆయన సందర్శించి, తోటల్లో పామ్ ఆయిల్ వీవిల్ పురుగు ఉధృతిని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన రైతు పోలాడి శ్రీరంగారావు  ఆయిల్‌పామ్ తోటనుసందర్శించి, తోటలో పామ్ ఆయిల్ వీవిల్ పురుగు ఉధృతి, పంట పరిస్థితి, తోట నిర్వహణ విధానాలను పరిశీలించారు. పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఆయిల్‌పామ్ సాగులో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా మంచి దిగుబడులు, అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు.

అదేవిధంగా ఒంటరి మహిళా రైతులు ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకు ఉద్యానశాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలకు అదనంగా జిల్లా యంత్రాంగం ద్వారా కూడా ప్రోత్సాహక సహాయం అందించడం జరుగుతుందనీ తెలిపారు. అర్హత కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విస్తృతంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులు ప్రతి నెలా ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు,ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ ఎస్. మహేష్, టి ఓ సి ఐ ఎల్ సీఈవో  కేశ్ కల్యాంకర్, ఫీల్డ్ సిబ్బంది శ్రీధర్, అభిలాషతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.