బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి
బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు పునరంకితం కావాలి: కలెక్టర్ రాజర్షి షా పిలుపు
ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. గురువారం స్థాని క రెవెన్యూ గార్డెన్‌లో బాల్య వివాహ నిరోధక అధికారులకు నిర్వహించిన అభయ అవగాహ న సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం బాల్య వివాహాల నిషేధంపై సీఎంపిఓలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేసి, కార్యక్రమానికి సంబంధించిన సెల్ఫీ పాయింట్ వద్ద అధికారులతో కలిసి ఆయన ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో బాలల సంరక్షణ కమిటీలు ప్రతి నెలా విధిగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. సమావేశాల మినిట్స్ బుక్‌ను పక్కాగా నిర్వహించాలని, బాధ్యతల మార్పిడి సమయంలో ఈ రికార్డులను అప్పగించాలని స్పష్టం చేశారు.
అవసరమైతే ఎఫ్.ఐ.ఆర్ నమోదు
కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ‘హాట్ స్పాట్’ ప్రాంతాలను గుర్తించి, అక్కడ వివాహాలు జరగడానికి గల మూల కారణాలను విశ్లేషించాలని సూచించా రు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళా జాతరలు, రంగో లి పోటీలు, వ్యాస రచన పోటీలు, ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. వివాహాలకు సహకరించే పురోహితులు, ఇమామ్లు, టెంట్ హౌస్ నిర్వాహకులు, క్యాటరర్లు, శుభలేఖలు ముద్రించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎఫ్.ఐ.ఆ ర్ (FIR) నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
బాల్య వివాహాల గురించి సమాచా రం ఇచ్చే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. బాల్య వివాహ రహిత పంచాయతీలను ప్రకటించేందుకు ’బాల వివాహ ముక్త భారత్’ పోర్టల్లో వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఉత్తమంగా పనిచేసే పంచాయతీ కార్యదర్శులకు, అధికారులకు జిల్లా యంత్రాంగం తరపున ప్రశంసా పత్రాలు, అవార్డులు అందజేస్తామన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, జిల్లా సం క్షేమ శాఖ అధికారి మిల్కా, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, చైల్ ప్రొటెక్షన్ కమిటి సభ్యులు సభ్యులు బాల్ చందర్, వెంకటస్వామి, సమీర్ ఖాన్, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, సిడిపిఓలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ICPS, 1098, సఖి కేంద్రం, సూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




