తెరపైకి అయోధ్య ట్రస్టు సీఈవో పోస్టు
- 18 మంది అభ్యర్థుల స్క్రీనింగ్
- నేడు, రేపు ఇంటర్యూలు
లక్నో, ఆగస్టు 10: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు(సీఈవో) కోసం 18 మందిని ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేశారు. రామాలయం సీఈవో పోస్టు కోసం సుమారు 5300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీ సుమారు 18 మంది పేర్లను ఇంటర్వ్యూ కోసం ఎంపిక చేసింది. అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉన్న వారికి ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులను మంగళ, బుధవారాల్లో ఆలయ పరిసరాల్లోనే ఇంటర్వ్యూ చేయనున్నారు.
మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సైంటిస్ట్ సురేశ్ హవారే, షిరిడి సాయిబాబా ట్రస్టు మాజీ చైర్మెన్ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉంటారు. రామాలయ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ వ్యవహారాల బాధ్యతలన్నీ సీఈవో చూసుకుంటారు. ఎంపికయ్యే అభ్యర్థి హిందూ మతస్తుడై ఉండాలి. హిందూ సంప్రదాయాన్ని, మార్గదర్శకాలను పాటించాలి.సీఈవో అభ్యర్థి సంపూర్ణ శాఖాహారి అయి ఉండాలి. మద్యం కూడా సేవించరాదు. సీఈవో అభ్యర్థి వయసు 50 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
రామాలయ విరాళాల చోరీ కేసు బయటపడిన తర్వాత సీఈవోను నియమించాలని ట్రస్టు అధికారులు భావించారు. యూపీ ప్రభుత్వం జూన్ 13న సిట్ ఏర్పాటు చేసింది. 15 రోజుల పాటు విచారణ చేపట్టారు. జూన్ 23వ తేదీన సిట్ రిపోర్టు ఇచ్చింది. జూన్ 25న 8 మంది నిందితులను అరెస్టు చేశారు.
అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాత్సవ, రామశంకర్ యాదవ్ , టిన్ను యాదవ్ అరెస్టు అయినవారిలో ఉన్నారు. దర్యాప్తు సమయంలో పోలీసులు క్యాష్ రికవరీ చేశారు. శుక్లా నుంచి 20 లక్షలతో పాటుబంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా రికవరీ చేశారు.






