16 July, 2026 | 9:15 AM

ఆయుర్వేదమే అమృతం

23-04-2024 12:05 AM

ఆయుర్వేదం అనేది ప్రాచీన భారతీయ వైద్య విధానం. ఆరోగ్యాన్ని..  ముఖ్యంగా వివిధ సీజన్లలో ఆహారం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వేసవిలో వాతావరణం వేడిగా, పొడిగా ఉన్నప్పుడు శరీరాన్ని చల్లబరచడానికి, హైడ్రేట్ చేయడానికి సహాయపడే ఆహారాలను తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

దోసకాయ: దోసకాయాలు అధిక నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. వేడి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ కూడా పని చేస్తాయి. ముఖ్యంగా చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తాయి. 

పుచ్చకాయ: పుచ్చకాయలో నీరు, ఎలక్ట్రోలైట్లు, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రీరాడికల్స్ వల్ల కలిగే సెల్యులార్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. చల్లదనాన్ని కలిగించే స్వభావం ఉండటం చేత శరీరంలోని వేడిని తగ్గించి దాహాన్ని తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

కొబ్బరి నీరు: కొబ్బరి నీరు సహజంగానే ఎలక్ట్రోలైట్స్‌ను కలిగి ఉంటుంది. చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. చల్లదనంతో పాటు తాజా దనాన్ని కలిగిస్తుంది. కొబ్బరి నీళ్ళను వేసవిలో ఆరోగ్యకరమైన డ్రింక్‌గా చెప్పవచ్చు. 

పుదీనా: పుదీనా శరీరానికి చలవ చేస్తుంది. అజీర్తి సమస్యను తగ్గిస్తుంది. వేడి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహయపడుతుంది. వంటకాలలో, పానీయాలకు మంచి రుచిని కూడా అందిస్తుంది.

కొత్తిమీర: కొత్తిమీర ఆకులు, గింజలు రెండింటిని ఆయుర్వేద వంటలలో ఉపయోగిస్తారు. వేడిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియ శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది.