అయ్యన్నపాత్రుడు ఇప్పటికీ ఫైర్‌బ్రాండే
- ఏపీ స్పీకర్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసలు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరని, సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నిక అనంతరం బాబు అయ్యన్నపై ప్రశంసల జల్లు కురిపించారు. అందరి ఆమోదంతో అయ్యన్న ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగిడిన అయ్యన్న 7సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపిగా గెలిచారని గుర్తు చేశారు. ప్రస్తుతం 66 ఏళ్లున్న అయ్యన్న ఇప్పటికీ ఫైర్‌బ్రాండేనని పొగడ్తలతో ముంచెత్తారు. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని, 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. ఇదంతా గమనించే నన్ను గౌరవ సభకు పంపారని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్
ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నేటి కూటమికి 164 సీట్లు వచ్చాయి. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారు. పోటీ చేసిన 21 స్థానాల్లో పార్టీని గెలిపించిన వ్యక్తి పవన అని పేర్కొన్నారు. ఎక్కడ తగ్గాలో... ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ అన్నారు.
ప్రజలు మీ హుందాతనం చూస్తారు : పవన్
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇన్నాళ్లు ప్రజలు మీ వాగ్దాటిని చూశారు. నేడు మీ హుందాతనం చూస్తారని స్పీకర్ అయన్నపాత్రుడుని ఉద్దేశించి పేర్కొన్నారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసింది. భాష మనసులను కలపడానికే విడగొట్టడానికి కాదు. ఎంత జఠిల మమస్యలు ఉన్నా చర్చల ద్వారా పరిష్కరించుకోవ్చన్నారు.
అక్రమ కేసులు పెట్టినా భయపడలేదు: లోకేష్
ఎప్పుడు ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్నపాత్రుడు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మీ నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయి. నాకు ఎప్పుడు సలహా కావాలన్నా మీతో సంప్రదించా. ఒకే పార్టీ.. ప్రజలే అజెండాగా ముందుకెళ్లిన అయ్యన్న పాత్రుడు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదన్నారు.






