జాతీయ ఇన్‌స్పైర్ పోటీలకు సిరిసిల్ల విద్యార్థి
- క్లాత్ ఫోల్డింగ్ యంత్రం తయారుచేసిన హేమంత్
- కలెక్టర్, డీఈవో, ఉపాధ్యాయుల అభినందన
రాజన్న సిరిసిల్ల, జూన్22 (విజయక్రాంతి): పవర్‌లూమ్‌లో ఉత్పత్తి అయిన బట్టలను మడత పెట్టేందుకు తన తల్లిదండ్రులు, కార్మికుల ఇబ్బందుల చూసి, చలించిపోయిన విద్యార్థి పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ యంత్రాన్ని తయారు చేసి జాతీయస్థాయి గుర్తింపును పొందాడు. సిరిసిల్ల పట్టణం గణేష్‌నగర్‌కు చెందిన జక్కని జ్ఞానేశర్, రూప దంపతుల కుమారుడు హేమంత్ సిరిసిల్ల శివనగర్‌లోని కుసుమ రామయ్య బాలుర ప్రభుత్వ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సిరిసిల్లలోని నేత కార్మికులు పవర్‌లూమ్‌లో ఉత్పత్తి అయిన బట్టలను మడత పెట్టేందుకు పడుతున్న ఇబ్బందులను తీర్చాలనుకున్నాడు.
వారి కష్టాలను దూరం చేయాలని ఎన్నో రోజులు ఆలోచించాడు. తన ఉపాధ్యాయుడు పాకాల శంకర్‌గౌడ్ సలహాలు, సూచనల మేరకు రెండు నెలల పాటు కష్టపడి రూ.రెండు వేలతో పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషీన్‌ను చక్రాలు, చైన్స్, మోటార్, సెన్సార్‌ను ఉపయోగించి తయారు చేశాడు. చేతులతో బట్టలు మడత పెట్టేందుకు గంట సమయం పడుతుండగా, ఈ యంత్రం సాయంతో కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేయవచ్చని హేమంత్ ప్రయోగం ద్వారా చూపి అందరి అభినందనలు పొందాడు.






