అత్యంత వైభవంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం
ఘట్ కేసర్ (విజయక్రాంతి): స్వామియే శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా అంటూ వందలాది మంది అయ్యప్ప మాలాదారులు చేసిన శరణుఘోషతో వెంకటాపూర్, తెనుగూడెం ప్రాంతం మారుమ్రోగింది. వెంకటాపురం అయ్యప్ప స్వామి వారి సన్నిదానంలో ఆదివారం కట్ట సత్యనారాయణ గౌడ్ గురుస్వామి నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం ఉదారి దర్శన్ గురు స్వామి చేతుల మీదుగా అత్యంత భక్తి శ్రద్దలతో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ మహోత్సవంలో స్థానిక ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు. పడిపూజలో 18 మెట్ల పూజతో పాటు మణికంఠ స్వామికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం, తేనాభిషేకం, పుష్పాభిషేకాలు చేశారు. ఉమ్మడి మండల వ్యాప్తంగా ఉన్న వందలాది మంది అయ్యప్ప మాలాదారులు, మహిళా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనడంతో పడిపూజ ప్రాంగణం కిటకిటలాడింది. అయ్యప్ప భక్త బృందం అయ్యప్పస్వామి కీర్తనలు, భజనలతో హోరెత్తించారు. దీంతో పడిపూజ మహోత్సవం అయ్యప్ప శరణుఘోషతో మార్మోగింది. అయ్యప్ప స్వాములు చేసిన పేటతుళై నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పూజలో పాల్గొన్న భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.






