కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ నిరంతర పోరాటం
సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి..
రామగిరి (విజయక్రాంతి): కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ నిరంతర పోరాటం చేస్తుందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆదివారం నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఐఎన్టీయూసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం, సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోందని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
వారసత్వ ఉద్యోగాల విషయంలో అభ్యర్థుల వయోపరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచడం జరిగిందని తెలిపారు. అలాగే నైని బ్లాక్ పనుల ప్రారంభానికి సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించి పనులు ప్రారంభించామని చెప్పారు. కార్మికుల సొంత ఇంటి పథకం కోసం రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని సంప్రదించగా, ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే కార్మికుల ఆకాంక్ష నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.గుర్తింపు సంఘం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి యాజమాన్యం, ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. ఐఎన్టీయూసీ మాత్రమే నిజంగా కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతుందని కార్మికులు గమనించాలని కోరారు.
అనంతరం ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సెంటర్ కాలనీ నుంచి గోదావరిఖని వరకు ఫోన్ లైన్ రోడ్ నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయని, అలాగే పోతన కాలనీ నుంచి సంతకాలని వరకు నూతన పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అంశంలోనూ కార్మికుల సంక్షేమానికి ఐఎన్టీయూసీ కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టైషన్ శ్రీనివాస్ (జాయింట్ సెక్రటరీ), గడం తిరుపతి యాదవ్, ఎలాంకి రామారావు (సెంట్రల్ కార్యదర్శులు), ఎన్. శ్రీనివాస రావు, సత్రం సమ్మయ్య (బ్రాంచ్ కార్యదర్శులు), సందేలా కుమార్ (బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శి), ప్రేమ్ కుమార్, టి. ప్రవీణ్ రెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.






