28 August, 2026 | 4:57 PM

జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా బి. రాజేందర్

28-08-2026 03:41 PM

నిర్మల్ ఆగస్టు 28 (విజయక్రాంతి): స్థానిక ఎస్.టి.యు. భవన్‌ నిర్మల్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఖానాపూర్ డివిజన్ నాయకుల ప్రతిపాదన మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సత్తెనపల్లిలో భౌతిక శాస్త్ర సహాయ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న బి. రాజేందర్ను ఎస్.టి.యు.టి.ఎస్. నిర్మల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా నియమించినట్లు జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్  తెలిపారు.

ఇటీవల పదవీ విరమణ పొందిన జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వాగోట్ శ్రీనివాస్ స్థానంలో బి. రాజేందర్‌ను నియమిస్తూ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన బి. రాజేందర్‌కు జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్.టి.యు.టి.ఎస్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ మాట్లాడుతూ, సంఘం కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులను సంఘం ఎల్లప్పుడూ గుర్తించి తగిన బాధ్యతలను అప్పగిస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగ పరిరక్షణ, ఉద్యోగులు–ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం ఎస్.టి.యు. నిరంతరం పోరాడుతుందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొంటూ, సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే సెప్టెంబర్ 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి బి. వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు విశ్వేశ్వరరావు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, ఎస్. బాలాజీ, దాసరి రాజన్న, గంగాధర్, మఠం పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.