01-07-2025 12:32:35 PM
హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (Sriram Sagar Project)కు గోదావరి నదీ జలాలను ప్రవహించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court of India) 2023లో ఇచ్చిన తీర్పు ప్రకారం, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని బాబ్లీ బ్యారేజీ 14 గేట్లను మంగళవారం ఉదయం 9:38 గంటలకు తెరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరచి ఉంచాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెలంగాణ, మహారాష్ట్ర(Telangana-Maharashtra) ఇరు రాష్ట్రాల నీటి పారుదల, సీడబ్ల్యూసీ అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తిన మహారాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. బాబ్లీ బ్యారేజీలో ప్రస్తుత నిల్వ ఇటీవలి సంవత్సరాలలో అత్యల్పంగా ఉందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 1,064 అడుగుల వద్ద నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బాబ్లీ గేట్లు(Babli Barrage Gates Opened ) తెరచుకోవడంతో దిగువన గల రైతులు, మత్స్యకారుల హర్షం వ్యక్తం చేసారు. గోదావరి నదికి నీటి ప్రవాహం సాయంత్రం వరకు పెరగనున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, జాలర్లు, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బాబ్లీ బ్యారేజ్ రెండు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా వివాదాస్పద సమస్యగా ఉంది. కానీ దాని నిర్వహణ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమానమైన నీటి భాగస్వామ్యాన్ని నిర్ధారించబడుతుంది.