calender_icon.png 2 July, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీలకమైన వృత్తి వైద్య వృత్తి

01-07-2025 04:38:06 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): సమాజంలో అత్యంత పవిత్రమైన, కీలకమైన వృత్తి వైద్య వృత్తి అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాంధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారని, ఆరోగ్యమే మహా భాగ్యమని మనిషికి ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించే ఆరోగ్యం లేకపోతే అదంతా వృధా అని, అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాద స్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యునికే ఉందని అన్నారు. డాక్టర్ వృత్తిని ఇతర వృత్తులతో పోల్చుకోలేమని తెలిపారు. జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఉత్తమ సేవలందించిన డాక్టర్లను శాలువా జ్ఞాపికలతో సన్మానించారు.

డాక్టర్లు సమాజానికి ఎంతో విలువైన సేవలు అందిస్తారని, మానవతా దృక్పథంతో చేసే పవిత్రమైన వృత్తిలో డాక్టర్లు ఉండడం వారి అదృష్టమని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న డాక్టర్లు మంచి సేవలు అందిస్తున్నారని కితాబునిచ్చారు. ఈ సేవలను ఇలాగే కొనసాగించడమే కాకుండా, మానవత్వాన్ని స్పృశించే విధంగా సేవలందించాలని కోరారు. భవిష్యత్తులో జిల్లా ప్రజలకు ఇంకా మంచి వైద్య సేవలు అందించి అందరి మన్ననలను పొందాల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ నాయక్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఇతర డాక్టర్లు ఉన్నారు.