01-07-2025 03:15:56 PM
ఈ భవనానికి అనుమతులు లేకపోవడం వలన కూల్చి వేశాం: మున్సిపల్ కమిషనర్ ఎస్.మల్లేశం
చండూరు,(విజయక్రాంతి): చండూర్ మున్సిపాలిటీలో మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న కు చెందిన నిర్మాణంలో ఉన్న భవనానికి అనుమతులు లేకపోవడం వలనకూల్చి వేసామని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎస్. మల్లేశం అన్నారు. మంగళవారం పోలీస్ బందోబస్తుతో ఈ భవనాన్ని కూల్చివేయడంతో ప్రజలు అవ్వాక్కయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపాలిటీలో మరో ఇంటి నిర్మాణాన్ని కూడా అనుమతులు లేవని, కూల్చివేతకు అనుమతి రాగానే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎవరైనా సరే మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
తాజా మాజీ చండూరు మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న మాట్లాడుతూ, నన్ను ఎమ్మెల్యే నా ఎదుగుదలను ఓర్వలేక నామీద కక్షగట్టి నా భవనాన్ని కూల్చివేశారని ఆయన అన్నారు. తన పక్కన ఉన్న ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన గృహ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకుని అక్రమంగా వ్యాపార సముదాయాలు నిర్మిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. నేను ఒక బీసీ నాయకుడు కాబట్టి నా మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆయన అన్నారు, ఇక్కడ రోడ్డును ఒకవైపు 40 ఫీట్లకు అధికారులు నిర్ణయించగా, నేను మాత్రం43 పీట్ల దూరంలో నా భవనాన్ని నిర్మించుకుంటున్నానని అయినా నా భవనాన్ని కూల్చివేయడం సరైనది కాదు అని అయన అన్నారు.
మున్సిపల్ కేంద్రంలోనే నేను ఉన్నప్పటికీ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా నా భవనాన్ని కూల్చివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చండూర్ లో నిర్మిస్తున్న రోడ్డు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని అంతా ఒకేలా నిర్మించాలని, అధికార పార్టీ నాయకులకు కమిషన్లు ఇస్తే తక్కువ వెడల్పు రోడ్డు నిర్మిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. నాకు జరిగిన అన్యాయాన్ని చండూర్ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని,నేను న్యాయం కోసం కోర్టును సంప్రదించనున్నట్లు వారు తెలిపారు. నేను ఈ ప్రాంతం కోసం పేద ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తున్నానని నాకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య పేద ప్రజలపరిస్థితి ఏంటి అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.