5 April, 2026 | 8:21 PM

బాబు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయం

05-04-2026 02:22 PM

జిల్లా కలెక్టర్ కె.హరిత 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): బాబు జగ్జీవన్ రామ్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వరరావు లతో కలసి హాజరయ్యారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... బాబు జగ్జీవన్ రామ్ కులమతాలకు పరిమితం కాకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు.

తప్పు చేసిన వారి తప్పులను గుర్తించేలా కృషిచేసి వారిని మార్చిన మహా వ్యక్తి అని కొనియాడారు. ఆయన పదవులను సమర్థవంతంగా నిర్వర్తించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. సామాన్య ప్రజల కంటే అధికారంలో పదవులు, అధికారులు ఎక్కువగా సేవలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టిన ఆణిముత్యం బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

మహనీయుల సేవలను గుర్తించడంతో పాటు మనలోనూ మార్పు రావాల్సి ఉందన్నారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. భావితరాలకు మానీయుడు అందించిన సేవలను తెలిసేలా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమవుతుందని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో అన్ని కుల సంఘాలకు స్థలం కేటాయించాలని అధికారులను కోరారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... 1908లో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న ఆయన వివక్ష గురై రాజీనామా చేశారని ఇది గుర్తించిన 14 ఏళ్ల బాబు జగ్జీవన్ రామ్ అసమాన తలపై పోరాటం చేసిన వ్యక్తిని అని కొనియాడారు.

ఓటమి ఎరుగని నాయకుడిగా 32 సంవత్సరాలు వివిధ శాఖలలో కేంద్రమంత్రిగా వ్యవహరించారని గుర్తు చేశారు. విద్య అనేది అన్ని రకాల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్లా మంగ, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు బాలకృష్ణ, సాలాం ,లక్ష్మి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రేగుంట కేశవరావు, రాష్ట్ర నాయకుడు పొన్నాల నారాయణ, గిరిజన సంఘం జాతీయ నాయకుడు  అర్జు మాస్టర్, పర్దాన్ సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్సింగా ప్రేమ్ కుమార్, మాలి సంఘం రాష్ట్ర నాయకుడు శంకర్, అఖిల గాండ్ల తేలికుల సంఘం జిల్లా అధ్యక్షుడు సందీప్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి తదితరులు పాల్గొన్నారు.