calender_icon.png 14 July, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బచ్చా ఆగయా భాయ్..

14-07-2025 01:36:25 AM

  1. వాట్సాప్ గ్రూప్‌లో కోడ్ భాష ద్వారా టెకీలకు గంజాయి అమ్మకం 
  2. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ‘ఈగల్’ డెకాయ్ ఆపరేషన్ 
  3. గంజాయి కోసం వచ్చిన 14 మంది.. 
  4. అదుపులోకి తీసుకుని డీఅడిక్షన్ సెంటర్‌కు తరలింపు 
  5. గ్రూపులోని మిగతా సభ్యుల కోసం ట్రేసింగ్ 
  6. గంజాయి అమ్మకందారు కోసం గాలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (విజయక్రాంతి): హైటెక్ సిటీలో డ్రగ్స్ మాఫి యా గుట్టురట్టయింది. బచ్చా ఆగయా భాయ్.. (సోదరా.. సరుకు వచ్చింది) అనే కోడ్ భాషతో ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల ను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ ఛేదించింది.

గచ్చిబౌలి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపం లో పక్కా ప్రణాళికతో నిర్వహించిన డెకా య్ ఆపరేషన్‌లో గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన 14 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఉం డటం గమనార్హం. అయితే, ప్రధాన నిందితుడు మహారాష్ర్టకు చెందిన సందీప్ అధి కారుల కళ్లుగప్పి పరారయ్యాడు.

పక్కా ప్లాన్‌తో డెకాయ్ ఆపరేషన్..

మహారాష్ర్టకు చెందిన సందీప్ అనే పాత నేరస్తుడు గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ, ప్రైవేట్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని గంజా యి విక్రయిస్తున్నట్లు ఈగిల్ బృందాలకు విశ్వసనీయ సమాచారం అందింది. నిందితుడు ప్రతీసారి సుమారు 5 కిలోల గంజా యిని 50 గ్రాముల చొప్పున 100 ప్యాకెట్లుగా చేసి, ఒక్కో ప్యాకెట్‌ను రూ.3,000 లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

తన వద్ద వంద మందికి పైగా రెగ్యులర్ కస్టమర్ల ఫోన్ నంబర్లతో కూడిన డేటాబేస్ నిర్వహిస్తూ, వాట్సాప్ ద్వారా కోడ్ భాషలో వారికి సమాచారం పంపేవాడు. ఈ సమాచారం ఆధా రంగా ఈగిల్ బృందాలు మఫ్టీలో నిఘా పెట్టి, గంజాయి కొనుగోలుదారులుగా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు రెండు గంటల వ్యవధిలో గంజాయి కొనేందుకు వచ్చిన 14 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడికక్కడే యూరిన్ డ్రగ్ టెస్టింగ్ కిట్లతో పరీక్షించగా, అందరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

పసిబిడ్డతో డ్రగ్స్ కోసం..

ఈ ఆపరేషన్ సందర్భంగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక జంట తమ నాలుగేళ్ల కుమారుడితో కలిసి గంజాయి కొనుగోలు చేసేందుకు రావడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆ మహిళను, చిన్నారిని వదిలిపెట్టి, పాజిటివ్‌గా తేలిన ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరొక జంట గంజాయి కోసం రాగా, ఇద్దరికీ జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.

తల్లిదండ్రులకు పోలీసుల విజ్ఞప్తి..

యువత, విద్యార్థులు మత్తుపదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈగల్ అధికారులు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని కోరారు. ఈగల్ ఎస్పీ సీహెచ్ రూపేశ్, డీఎస్పీ సి. హరిశ్చంద్ర రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ పీ రమేశ్‌రెడ్డి, సిబ్బంది ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.

ప్రధాన నిందితుడి కోసం గాలింపు..

నిందితుడు సందీప్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పట్టుబడిన వారి ఫోన్ల నుంచి వాట్సాప్ చాటింగ్‌లు, డిజిటల్ ఆధారాలను సేకరించి, డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు. సందీప్ వద్ద ఉన్న 100 మంది కస్టమర్ల జాబితాను పరిశీలిస్తున్నారు.

మిగిలిన 86 మంది వినియోగదారులు, ఈగల్ అధికారులు పట్టుకోకముందే స్వచ్ఛందంగా డీ-అడిక్షన్ కేంద్రాలకు వెళ్లడం మంచిదని అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన 14 మందిని డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించనున్నట్లు తెలిపారు.