14-07-2025 08:21:30 AM
కడప: అన్నమయ్య జిల్లా(Annamayya District) పుల్లంపేట మండలం రెడ్డిపల్లె కాజ్‌వేపై ఆదివారం రాత్రి మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తాపడి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో పది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులున్నారు. మృతులను సుబ్బరత్నమ్మ(45), చిట్టెమ్మ(25) గజ్జల లక్ష్మీదేవి(36) రాధ(39), వెంకట సుబ్బమ్మ(37), గజ్జల రమణ(42), ముని చంద్ర(38), గజ్జల దుర్గయ్య(32), గజ్జల శ్రీను(33)గా గుర్తించారు. మృతులను రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. రాజంపేట మండలం ఇసుకపల్లె నుండి రైల్వే కోడూరు మార్కెట్‌కు(Railway Kodur Market) వెళ్తున్న వాహనం రెడ్డిపల్లె కాజ్‌వే దాటుతుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో లారీలో 19మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో ప్రధానంగా మామిడి పంట(Mango crop) కోతలో ఉన్న రైతు కూలీలు ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సిబ్బంది క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి(Rajampet Government Hospital) తరలించారు. మృతులను పోస్ట్‌మార్టం కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బోల్తా పడిన లారీని తరలించడానికి, కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు క్రేన్‌ను ఉపయోగించాయి. దీంతో కడప-తిరుపతి(Kadapa-Tirupati) మార్గంలో రద్దీ ఏర్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఓవర్‌లోడింగ్, రోడ్డు పరిస్థితులు సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.