14-07-2025 02:39:41 AM
హైదరాబాద్,సిటీబ్యూరో జూలై 13 (విజయక్రాంతి): రాష్ర్ట రాజకీయాల్లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా జాగృతి కార్యకర్తలపై దాడి చేయిం చి, గన్‌మెన్లతో కాల్పులు జరిపించారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ ఘటన వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఫిర్యా దు అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న మీద కంప్లుంట్ చేయడానికి డీజీపీ ఆఫీసుకు వచ్చానని, మా జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది మల్లన్ననా? లేక ప్రభుత్వమా? అనేది తేలాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే డీజీపీ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం, ఈ ఘటన వెనుక ప్రభు త్వ ప్రమేయం ఉందనే తమ అనుమానాలను బలపరుస్తోందని ఆమె ఆరోపించారు.
గన్‌మెన్లను వెంటనే డిస్మిస్ చేయాలి
జాగృతి కార్యకర్తలపై కాల్పుల ఘటనను కవిత తీవ్రంగా ఖండించారు. ‘అసలు తీన్మా ర్ మల్లన్న గన్‌మెన్లు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. మల్లన్న ఆదేశాలు లేకుండా గన్‌మెన్లు కాల్పులు జరపరు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏనాడూ పోలీసులు ఇలా కాల్పులు జరపలేదు.
కానీ ఈ రోజు మా కార్యకర్తలపై కాల్పులు జరపడం అత్యంత బాధాకరం. ఈ ఘటనకు బాధ్యులైన గన్‌మెన్లను తక్షణమే సర్వీసు నుంచి తొలగించాలి’ అని కవిత డిమాండ్ చేశారు. ఈ ఘటనతో రాష్ర్టంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోందని ఆమె అన్నారు.