calender_icon.png 14 July, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పర్శతో పారదర్శకత!

14-07-2025 01:42:41 AM

  1. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై నిరంతర పర్యవేక్షణ 
  2. అమల్లోకి కొత్త డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ 
  3. పథకాల ఖర్చుల ట్రాకింగ్‌కు అవకాశం 
  4. కేంద్ర నిధుల కోసం రాష్ట్రాల వాటా చెల్లించాల్సిందే 
  5. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు దారి మళ్లించకుండా చర్యలు

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ప్రజల సంక్షేమం కోసం అమలు చేసే పథకాల్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కొన్ని కేంద్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటా యి. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిధులు కేటాయించి అమలు చేసే పథకాలు కూ డా ఉంటాయి. సమన్వయ లోపం, నిధుల దారి మళ్లింపు వంటి ప్రక్రియల కారణంగా ఉమ్మడిగా అమలు చేసే పథకాల్లో జాప్యం జరుగుతుంది.

కొన్నిసార్లు కేంద్ర ప్రభు త్వంపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం నెపం నెట్టి పథకాల నిర్వీర్యానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఉమ్మడి పథకాల అమలుకు విడుదలయ్యే నిధులను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఉమ్మ డి పథకాల సీఎస్‌ఎస్ (సెంట్రల్ స్పాన్స ర్డ్ స్కీమ్స్) నిధుల వినియోగంలో పారదర్శకత, సమర్థత, బాధ్యతను పెంచేందుకు ‘స్పర్శ’ అనే నూ తన డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ రెగ్యులర్ పర్యవేక్షణ కోసం సమగ్ర వ్యవస్థను రూపొందించింది. ఈ పథకాలకు మంజూరైన నిధులు, పనుల నిర్వహణపై కొత్త ఆర్థిక నియంత్రణ విధానం అమలులోకి తెచ్చింది. 

వాటా చెల్లింపులు, పథకాల అమలులో జాప్యం లేకుండా..

రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్‌ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ద్వారా వివిధ పథకాలు, పనులకు నిధులు విడుదల చేస్తోంది. కేంద్రం పీఎఫ్‌ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ద్వారా నిధు లు మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో సెంట్రల్ ఫండ్స్ నిధులను రాష్ర్ట ప్రభుత్వాలు దారి మళ్లించడం.. తన వాటా చెల్లించకుండా జాప్యం చేయ డంతో పనులు, పథకాల అమలులో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

సంక్షేమ ఫలాలు లబ్ధిదా రులకు చేరడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక్కొక్కసారి ఒక పథకానికి కేటాయించిన నిధులను వేరే వాటికి మళ్లించడం ద్వారా పథకం లక్ష్యం నెరవేరడం లేదు. దీంతో ఉమ్మడి పథకాల నిధులు పకడ్బందీగా వినియోగించేందుకు కేంద్రం ‘స్పర్శ’ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా పారదర్శకత పెరుగుతుంది. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చవుతుందో ట్రాక్ చేయవచ్చు.

సమయానికి నిధుల వినియోగం, ఆలస్యం లేకుండా కార్యక్రమాలు ముందుకు సాగనున్నాయి. ఇక మీదట ‘స్పర్శ’లో కేంద్రం నిధులు జమ చేసినా..రాష్ర్ట వాటా నిధులు వేయకపోతే.. డ్రా చేసుకోవడం కుదరదు. రాష్ర్టం తన వాటా నిధులు జమ చేసిన తర్వాతే ఈ నిధులు డ్రా చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. పథక ప్రణాళిక, నిధుల విడుదల, ఖర్చుల ట్రాకింగ్, ఫలితాల విశ్లేషణ అన్నీ ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించనున్నది. 

సమస్యలకు చెక్ పెట్టేందుకు..

సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్‌లకు కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల జీవన్ మిషన్, పీఎం ఆయుష్మాన్ భారత్, సమగ్ర శిక్షా అభియాన్, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనార్టీ శాఖలు, న్యాయశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రిన్యూర్, అగ్రికల్చర్, స్కూల్ అండ్ ఎడ్యుకేషన్, పర్యావరణం, అటవీశాఖలు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హౌసింగ్ కార్పొరేషన్ తదితర శాఖలకు సంబంధించిన పథకాలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది.

కేంద్ర పథకాల నిధులను తుది లబ్ధిదారుల వరకు పారదర్శకంగా పంపిణీ చేయడానికి నూత న డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థ రూపొందించారు. ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన నిధులను వేరే అవసరాలకు వాడుతుండటం..లేక తమ వాటా నిధులను ఆలస్యం చేయడం వంటి సమస్యలు వెలుగు చూడటంతో దీనికి చెక్‌పెట్టేందుకు కేంద్రం ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చింది.

అంతేకాకుండా ‘జస్ట్ ఇన్ టైం’ను అమలు చేస్తోంది. పథకాలు, పనులకు సంబంధించిన వివరాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ను ఎప్పటికప్పుడు కేంద్రం ఆయా శాఖలకు సంబంధించిన వైబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్‌లో ఆయా శాఖలకు సంబంధించినవి అప్‌లోడ్ చేయాలి. ప్రతిరోజు మధ్యా హ్నం మూడు గంటలలోపు అప్‌లోడ్ చేస్తే అదే రోజు నిధులు డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్‌లోడ్ చేస్తే మరుసటి రోజు నిధులు డ్రా చేసుకోవాల్సి వస్తుంది.   

నిధుల మంజూరుకు ఆర్బీఐ ఖాతాలు

ఉమ్మడి పథకాల నిధుల దుర్వినియోగానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టడంలో భాగంగా తుది లబ్ధిదారుడి వరకు ప్రతి రూపాయి ఖర్చును ట్రాక్ చేయడానికి ‘స్పర్శ’ సాఫ్ట్‌వేర్ దోహదం చేయనున్నది. అన్ని సీఎస్‌ఎస్ పథకాల నిధులను ఆర్‌బీఐలో ఆధార్ లింక్డ్ ఇంటిగ్రేటెడ్ ఖాతాల ద్వారా మాత్రమే చెల్లించనున్నది. కేంద్ర పథకాలు, పనులకు నిధులు మంజూరయ్యే శాఖలన్నీ ఇక ఆర్బీఐ ఖాతాలు తెరవాల్సిందే.

ఐఎఫ్‌ఎంఐఎస్, పీఎఫ్‌ఎంఎస్ ద్వారా మంజూరై నిధులను ఈ ద్వా రా ఆర్బీఐకి అనుసంధానం చేయనున్నారు. ఈ రెండు విభాగాల ద్వారా జమచేసిన నిధులు ఆర్బీఐలో మ్యాచింగ్ అయిన తర్వాత డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. రాష్ట్రాలు తమ వాటాను పూర్తి స్థాయిలో చెల్లించకపోతే, కేంద్రం తన వాటా నిలిపివేయనున్నది. సీఎస్‌ఎస్ కింద వచ్చిన నిధులను ఇతర ఖర్చుల కోసం వాడకూడదు.

కాగా ఆర్బీఐ అకౌంట్లు నిర్వహణ అన్ని రాష్ట్రాలకూ అంత సులభం కాదని, టెక్నికల్ మద్దతు అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రాల బడ్జెట్‌లో అనుసరించే విధానాల వల్ల కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు తమ వాటాను సమయానికి చెల్లించడం కష్టంగా మారవచ్చు. నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల పథకాలు, పనులు, ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్రా లు సమన్వయంతో ముందుకెళ్తేనే ఈ విధా నం విజయవంతం అవుతుందంటున్నారు.