14-07-2025 01:33:00 AM
-9 ఏండ్ల నూతన రేషన్ కార్డు ఎదురుచూపులకు నేటితో తెర
-ముఖ్యమంత్రి హామీలతో మారనున్న తుంగతుర్తి నియోజకవర్గ రూపురేఖలు.
-ఎమ్మెల్యే మందుల సామేలు కృషితో తీరనున్న ఏండ్ల సమస్యలు
సూర్యాపేట/ తుంగతుర్తి, జూలై 13 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహకారంతో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కృషి వలన గతంలో ఏనాడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో రూ.1400 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నూతన రేషన్ కార్డు పంపిణీనీ ముఖ్యమంత్రి నేడు జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో పేదలకు అందజేయనున్నారు. గడిచిన 9 సంవత్సరాల ఎదురుచూపులకు నేడు తుంగతుర్తి నియోజకవర్గంలో తెరపడనుంది. ప్రస్తుత ప్రభుత్వం పేదల ఆకలి బాధలు తీర్చాలన్న ఆకాంక్షతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం అందజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
తుంగతుర్తి నుండి పంపిణీ శ్రీకారం: జూలై 14న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు జన్మదినం సందర్భంగా, ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డుల పంపిణీకి తుంగతుర్తి నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే మందుల సామేలు మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గతంలో ఏ ఎమ్మెల్యేకు రానంత మెజారిటీ సుమారు 52,000 వేల పైచిలుకు ఓట్లతో గెలవడం, ఈ ప్రాంతం వెనుకబడి ఉండడంతో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే ప్రభుత్వం ఈ పథకానికి ఇక్కడి నుండి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. అయితే మొదటిసారిగా ఎమ్మెల్యే అయినా మందుల సామేలు గెలిచిన నాటి నుండే వెనుకబడ్డ తుంగతుర్తి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులతో సాన్నిహిత్యంగా ఉంటూ వందల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రత్యక్ష నిదర్శనం.
తుంగతుర్తి అభివృద్ధి లక్ష్యంగా..
గడిచిన 18 నెలల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గానికి సుమారు 1400 కోట్ల నిధులతో అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే మందుల సామేలు నిరంతర కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి దశలో గెలవగానే తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో దళితుల వీధుల్లో ఇండ్ల నుండి వెళుతున్న ఐటెన్షన్ వైర్లను 30 సంవత్సరాలు ఏ ఎమ్మెల్యే చేయలేని పని ,పట్టుమని పది రోజుల్లోనే పూర్తి చేయడం గమనార్హం. ప్రభుత్వం చేసిన రుణమాఫీలో నియోజకవర్గంలోనీ 25,269 మంది రైతులకు లబ్ధి చేకూరింది. గడిచిన 30 సంవత్సరాల కాలంలో మెయిన్ రోడ్డు నుండి గురుకులాలకు వెళ్లే రహదారులు, మట్టితో ఉండి, వానాకాలంలో ఒక పక్క విద్యార్థులు మరొక పక్క సిబ్బంది ,కష్టాలను చూచి తక్షణమే 20 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నూతన సీసీ రోడ్డును ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గ్రామాలలో పూర్తి అయినటువంటి అంగన్వాడి, గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. తుంగతుర్తి మండల కేంద్రంలో సుమారు రూ.45 కోట్ల నిధులతో ఏరియా దవాఖాన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తి అయితే తుంగతుర్తి నియోజకవర్గంలోని పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమలగిరి మండల కేంద్రంలో 30 సంవత్సరాలుగా విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్ విద్యార్థుల కోసం నూతనంగా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. సుమారు 13 కోట్లతో సంఘం బ్రిడ్జి, కోడూరు కొమ్మాల మీదుగా నూతనకల్ వరకు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 12 కోట్లతో కేతిరెడ్డి బ్రిడ్జి కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే సుమారు 100 ల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.
తుంగతుర్తి నుంచి రావులపల్లి ఎక్స్ రోడ్డు వరకు నూతన రహదారి రోడ్డు వెడల్పు నిర్మాణ పనులు 13 కోట్లతో కొనసాగుతున్నాయి. తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం నియోజకవర్గం లో సకల సౌకర్యాలతో సుమారు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో వందల కోట్లతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేశారు. తిరుమలగిరి నుండి అడ్డ గూడూరు వరకు నూతన రహదారి నిర్మాణం లో భాగంగా నూతన బ్రిడ్జి పనులు అనంతరం వద్ద కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నియోజకవర్గంలో 3500 ల లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నిర్మాణ పనులకు నిధులు కేటాయిస్తున్నారు.
రానున్న రోజుల్లో నియోజకవర్గంలో రుద్రమచర్లను రిజర్వాయర్ గా మార్చడం ద్వారా వేల ఎకరాలు రైతులకు సాగులోకి రానున్నాయి. యువతకు ఉద్యోగ అవకాశాల కోసం పారిశ్రామిక కారిడార్ అడ్డగూడూరు మండలంలో సుమారు 200 ఎకరాల్లో ఏర్పాటు చేయడం కోసం ప్రతిపాదనలు జరిగాయి. తుంగతుర్తి మండల కేంద్రంలో నూతనంగా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయుటకు కృషి చేస్తున్నారు. కేవలం 18 నెలల కాలంలోనే ఇన్ని వందలకోట్లతో అభివృద్ధి పనులు చేపడుతుండడంతో నియోజకవర్గ ప్రజలు సంతోష వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే మందుల సామేలు పుట్టినరోజు నాడే తెలంగాణ రాష్ట్ర మొత్తం పేదలకు నూతన రేషన్ కార్డుల పంపిణీనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టడం చరిత్రలో నిలిచిపోయే రోజుగా నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. మరిన్ని నిధులతో తుంగతుర్తి నియోజకవర్గం అని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆశిద్దాం..