3 September, 2026 | 5:22 AM

కేసులు ఉపసంహరణ

03-09-2026 | 03:00am
  1. రైతులు, టీచర్ల డిమాండ్లు పరిష్కరిస్తాం
  2. అసెంబ్లీలో తమిళనాడు సీఎం విజయ్
  3. నీట్ ఆందోళనల విద్యార్థులపై కేసులు ఎత్తేయండి: సీపీఐ

చెన్నై, సెప్టెంబర్ 2: ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, తమ డిమాండ్ల సాధన కోసం గత ప్రభుత్వ పాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసిన రైతులు, ఉపాధ్యాయులపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరింకోవాలని నిర్ణయించామని తమిళనాడు సీఎం విజయ్ (Tamil Nadu CM Vijay) ప్రకటించారు. రైతులు, ఉపాధ్యాయులకు టీవీకే ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం ప్రకటించారు.

బుధవారం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్‌లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీ ఎత్తున కేటాయింపులను ప్రకటించారు. అనంతరం సీఎం విజయ్ మాట్లాడుతూ.. 2021 నుంచి 2026 ఏప్రిల్ వరకు తమ హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులు, ఉపాధ్యాయులు చేసిన శాంతియుత పోరాటంపై గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించు కుంటామని స్పష్టం చేశారు. సిప్కాట్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో దొంగలపై విధించే నిరోధక చట్టాలను రైతులపై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పరంతూరు విమానాశ్రయ నిర్మాణంలో భాగంగా తమ భూములు కోల్పోతున్నామనే ఆవేదనతో రైతులు నిరసనలు తెలియజేస్తే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. రైతులు, ఉపాధ్యాయులపై అన్ని కేసులను ఎత్తేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఇటీవల నీట్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలపై కూడా పలు కేసులు నమోదు చేశారని వాటిని కూడా ఎత్తేయాలని సీపీఐ పార్టీ సీఎం విజయ్‌కు విజ్ఞప్తి చేసింది.