24 May, 2026 | 1:26 AM

థానే జిల్లాలో ఘోరం

21-08-2024 06:08 AM
  1. ఎల్‌కేజీ చిన్నారులపై లైంగికదాడి 
  2. బద్లాపూర్‌లో స్కూల్ స్వీపర్ దుశ్చర్య 
  3. 13వ తేదీనే దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి 
  4. ఆగ్రహోదగ్రులైన ప్రజలు.. స్కూల్‌లో విధ్వంసం 
  5. రోజంతా రైల్‌రోకో.. పోలీసులపై రాళ్లు 
  6. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్న సీఎం షిండే 
  7. ప్రభుత్వ న్యాయవాదిగా ఉజ్వల్ నికం

థానే, ఆగస్టు 20: మహారాష్ట్రలోని థానే జిల్లాలోని బద్లాపూర్‌లో ఓ స్కూల్ స్వీపర్ దారుణానికి పాల్పడ్డాడు. పాఠశాలలో కిండర్ గార్డెన్ చదువుతున్న మూడు, నాలుగేండ్ల పసికందులపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు పొక్కగానే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలమంది ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిం చారు. పోలీసుల అలసత్వం ప్రజల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. రైళ్ల రాకపోకలను అడ్డుకొని పోలీసులపై రాళ్లు రువ్వారు. స్కూలును ధ్వంసం చేశా రు. నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది.

ఆలస్యంగా వెలుగులోకి..

బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న మూడు, నాలుగేండ్ల చిన్నారులను ఈ నెల 13వ తేదీన ఆ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తి లైంగికంగా వేధించాడు. అతడు ఏం చేశాడో కూడా తెలియని అమాయక చిన్నారులు ఎవరికీ ఏమీ చెప్పలేదు. అయితే, బాధితుల్లో ఒక చిన్నారి ఈ నెల 16వ తేదీన స్కూలు వెళ్లనని మారాం చేయటంతో తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నావని ప్రశ్నించారు. దీంతో చిన్నారి అసలు విషయం చెప్పింది.

దీంతో చిన్నారిని తల్లిదండ్రులు దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఆమె ప్రైవేటు అవయవాల వద్ద గాయాలైనట్లు తేలింది. వెంటనే వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. ఫిర్యాదు చేసిన 12 గంటల తర్వాత ఈ నెల 17వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ విషయం పట్టణంలో అందరికీ తెలియటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి వేలమంది రోడ్లపైకి వచ్చారు. రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైల్ రోకో మొదలుపెట్టారు. కొందరు నిరసనకారులు రైళ్లపై రాళ్లు రువ్వారు. పాఠశాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ప్రభుత్వాన్ని వణికించిన ప్రజాగ్రహం

బద్లాపూర్‌లో ప్రజాగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గంటలు చిగురుటాకులా వణికింది. వేలమంది ఆగ్రహాన్ని చూసి భయపడిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆగమేఘాల మీద నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటన చేశారు. ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం సెక్షన్ 65(20)తోపాటు సెక్షన్ 74, 75, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 76 కింద కేసు నమోదు చేశారు.

నిందితుడికి ఉరి శిక్ష పడేలా చేస్తామని సీఎం ప్రకటించారు. ‘థానే పోలీస్ కమిషనర్‌తో మాట్లాడాను. నిందితుడిపై కఠిన నిబంధనల కింద కేసులు నమోదుచేయాలని ఆదేశించాను. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తాం. ప్రజలు కోరుకొన్నట్టే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చూసేందుకు నిందితుడికి ఉరిశిక్ష వేయాలని కోర్టును కోరుతాం. పాఠశాల, పోలీసుల నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించాం’ అని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ఐజీ స్థాయి అధికారి ఆర్తి సింగ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు డిఫ్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. 

పోలీసులు, స్కూల్ తీవ్ర నిర్లక్ష్యం

చిన్నారులపై ఇంత దారుణం జరిగినా పాఠశాల యాజమాన్యం కనీసం పట్టించుకోలేదు. స్థానిక పోలీసులు కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించటంతోనే ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుభికింది. స్కూళ్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయటం లేదు. ప్రాథమిక తరగతులకు టీచర్లు, సహాయకులందరినీ మహిళలనే నియమించాల్సి ఉండగా స్కూల్ యాజమాన్యం ఆ నిబంధన పాటించలేదు. జరిగిన దారుణంపై ఆలస్యంగా స్పందించిన స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్, ఒక టీచర్‌తోపాటు మహిళా సహాయకురాలిని సస్పెండ్ చేసింది. పోలీస్ విభాగం కూడా చర్యలకు దిగింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌తోసహా ముగ్గురిని సస్పెండ్ చేసింది. స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిని బదిలీ చేశారు. ఈ ఘటనపై పోలీసులతోపాటు విద్యాశాఖ కూడా దర్యాప్తు ప్రారంభించింది. 

థానేకు బాలల హక్కుల కమిషన్

థానే ఘటనపై జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్సీపీసీఆర్) చైర్‌పర్సన్ ప్రియాంక్ కానుంగో స్పందించారు. చిన్నారుపై అంత దారుణం జరిగితే పాఠశాల యాజమాన్యంతోపాటు పోలీసులు కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయాన్ని తొక్కిపెట్టేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఎన్సీపీసీఆర్ బృందాన్ని థానేకు పంపనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన వ్యక్తంచేశారు.

ఇలాంటి కేసుల్లో సుదీర్ఘ న్యాయ విచారణకు అవకాశం ఇవ్వరాదని అన్నారు. ‘బద్లాపూర్ పాఠశాల ఓ బీజేపీ కార్యకర్తదని తెలిసింది. అయినా, ఈ సమయంలో నేను దీనిని రాజకీయం చేయదలుచుకోలేదు’ అని పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాదిగా ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికంను నియమించారు. ముంబైపై ఉగ్రదాడి కేసులో కూడా ఈయనే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు