24 May, 2026 | 12:39 AM

బలుపు తగ్గలే అహంకారమూ తగ్గలేదు

21-08-2024 06:12 AM
  1. చేతనైతే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడు 
  2. నీ అయ్య విగ్రహం పెట్టేందుకా రాజీవ్ విగ్రహం తొలగించేది? 
  3. దొంగలకు, తాగుబోతులకు సచివాలయం ఎదుట స్థానం లేదు 
  4. మాజీ మంత్రి కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్ 
  5. డిసెంబర్ 9న సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని స్పష్టం 

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ నేతల విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘రాజీవ్‌గాంధీ విగ్రహం సచివాలం ఎదుట పెడతామంటే కొందరు సన్నా సులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని అంటున్నారు. చేతనైతే ఎవడైనా ఆ విగ్రహన్ని  టచ్ చేయండి ’ అని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు తదితరులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికా రం పోయినా కొందరు బీఆర్‌ఎస్ నేతలకు అహంకారం, బలుపు తగ్గడం లేదని అన్నా రు. ‘కేటీఆర్.. నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించాలంటావా? అధికారంలోకి వస్తే అని మాట్లాడు తున్నావ్.. బిడ్డా మీకు అధికారం ఇక కలే. చింతమడకకే పరిమితం కావాలి’ అని అన్నా రు. సచివాలయం ఎదుట ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్నోళ్ల విగ్రహం కాదని, దొంగలకు, తాగు బోతులకు స్థానం లేదని స్పష్టంచేశారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన రాజీవ్‌గాంధీ విగ్రహం సచివాలయం ముందు  ఉండాలని పేర్కొన్నారు.

రాజీవ్‌గాంధీ దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన గొప్ప నాయకుడని అన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన మహానీయుడని కొనియాడా రు. మహిళలు రాజకీయాల్లో రాణించేందు కు ఆయన ఎన్నో  సంస్కరణలు తీసుచొచ్చారని పేర్కొన్నారు. దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తిప్రదాత అని ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుటు పండుగ వాతా వరణంలో ఆవిష్కరిస్తామని స్పష్టంచేశారు. 

పదేళ్లలో ఎందుకు పెట్టలే?

పదేళ్లు అధికారంలో ఉండీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టనోళ్లు ఇప్పుడు పెడుతామని మాట్లాడ టం సిగ్గు చేటని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న సచివాలయం లోప ల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు విచక్షణ కోల్పో యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమించదని హెచ్చరించారు. సౌత్ కొరియాలో ఒక వర్సిటీకి చెందిన 16 మంది కి ఒలింపిక్స్ పతకాలు వచ్చాయని, అందుకే తెంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా మట్టిలో మా ణిక్యాలను వెలికి తీస్తామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన 

తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లో ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు స్థలాన్ని పరిశీలించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. విగ్రహ డిజైన్‌పై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని ఆదేశించారు.