అలసత్వం వద్దు
రుణమాఫీకి రూ.18 వేల కోట్లు విడుదల చేస్తే రూ.7,500 కోట్లు రైతులకు చేరిక
- త్వరగా రైతులకు తిరిగి రుణాలు ఇవ్వాలి
- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
- మంత్రి తుమ్మలతో కలిసి బ్యాంకర్లతో సమీక్ష
బ్యాంకర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు
హైదరాబాద్, ఆగస్టు 20(విజయక్రాంతి): రుణమాఫీ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని.. వారం రోజులు ఆలస్యమైతే ఫలితం ఉండదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగవారం ప్రజాభవన్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బ్యాంకర్లతో సమీక్షించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రూ.18 వేల కోట్లు బ్యాంకులకు చేర్చామని, రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.7,500 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రాష్ట్రానికి వ్యవసాయ రంగం వెన్నెముకగా భావిస్తామని, రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తామని చెప్పారు. భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తామని తెలిపారు.
ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రుణమాఫీ ద్వారా రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయంతోపాటు పారిశ్రామిక రంగాన్ని ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుందని చెప్పారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి , ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు.. అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి రూ.36 వేల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు చెప్పారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుందని, వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని బ్యాంకర్లకు సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్లు వడ్డీలేని రుణాల రూపంలో ఇస్తామని, వారికి సహకరించి పారిశ్రా మిక అభివృద్ధి చేయాలని కోరారు.
2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రాధాన్య రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రం నగదు నిల్వల నిష్పత్తి మొదటి త్రైమాసికంలో 127.29 శాతానికి మెరుగు పడటం ఆసక్తికరమైన అంశమని పేర్కొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండే లా తమ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. వరి ఉత్పత్తిలో పెరుగు దల ఎఫ్‌సీఐకి ధాన్యం సరఫరా చేసే రాష్ట్రాల్లో ప్రధాన రాష్ట్రంగా ఎదగడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. రాబోయే త్రైమాసికానికి నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కోరారు.






