03-12-2025 04:01:33 PM
కోదాడ: కోదాడ మండలం గణపవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బల్లూరి స్నేహ దుర్గయ్య ఎన్నికల బరిలో నిలిచారు.బల్లూరి స్నేహ దుర్గయ్య B.Sc (బయోటెక్నాలజీ), M.Sc (సైకాలజీ) విద్యార్హతలు కలిగి ఉన్నారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో గత కొన్ని సంవత్సరాలుగా చురుకుగా పాల్గొంటున్న స్నేహ దుర్గయ్యకు గ్రామంలోని ప్రతి కుటుంబం సమస్యలు సుపరిచితంగా ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. 1999లో వారి కుటుంబానికి గ్రామ విద్యా కమిటీ చైర్మన్‌గా అవకాశం లభించగా, ప్రభుత్వ నిధులతో ఎస్సీ కాలనీలో పాఠశాల భవనం నిర్మించారు.
దీనివల్ల గ్రామంలోని నిరుపేద విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగయ్యాయి. 2010లో వారి అత్తగారి స్మారకార్థంగా గ్రామ తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు వేయించి, మోటార్ ఏర్పాటు చేసి, పైప్‌లైన్ పనులు పూర్తి చేయడంతో పాటు వాటర్ ప్లాంట్‌ను పునరుద్ధరించారు. దీంతో గ్రామంలోని ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది.2012 నుంచి కోదాడలోని ఆస్క సంస్థ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ అందిస్తూ, ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
అలాగే గణపవరం గ్రామ చెరువు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఎస్టిమేట్లు, డిజైన్లు, సాంకేతిక సహకారం అందించారు. ప్రస్తుతం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా చేపడుతున్న దేవాలయ ముఖద్వార నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పడటంతో పాటు టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నారు.గ్రామాభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాల విస్తరణలో తన వంతు పాత్ర పోషిస్తానని ఈ సందర్భంగా బల్లూరి స్నేహ దుర్గయ్య తెలిపారు. గణపవరం గ్రామాభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని ఆమె పేర్కొన్నారు.