03-12-2025 02:34:20 PM
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kavitha) గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ప్రభుత్వ ధనం వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి ఫిర్యాదు చేశారు. మక్తల్, కొత్తగూడెం సభల్లో సర్పంచులుగా మంత్రులు, ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి పనులు చేయించే వారిని గెలిపించాలని కోరి ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని కవిత ఆరోపించారు. ప్రజా ధనాన్ని వినియోగించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఇదివరకే తెలంగాణ జాగృతి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. నవంబర్ 30వ తేదీన జాగృతి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి ప్రచారాన్ని నిలిపేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కట్టడి చేస్తారని ఆశిస్తున్నామని కవిత పేర్కొన్నారు.