పెట్రోల్, డీజిల్ కొరత లేనేలేదు.. సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) వెల్లడించారు. సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని సూచించారు. ఆయిల్ సంస్థల వద్ద పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని వివరించారు. ఆయిల్ సరఫరాలోనూ ఇబ్బందులు లేవని తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆయిల్ నిల్వలపై కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు. అవసరానికి మించి కొనుగోళ్లతో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని బండి సంజయ్ హెచ్చరించారు.
ప్రజలు భయాందోళనలకు గురై పెట్రోల్, డీజిల్ నింపుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బుధవారం వాహనదారులకు హామీ ఇచ్చింది. భయాందోళనలతో కొనుగోళ్లు చేయవద్దని కోరింది. నగరంలో ఇంధన సరఫరా తగినంతగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, భయాందోళనలకు గురైన ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. జనాలు పొటేత్తడంతో పెట్రోల్ బంకుల్లో పోలీసుల బందోబస్తు నడుమ పెట్రోల్, డీజిల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు తగిలించగా, మరికొన్ని బంకుల్లోకి వాహనాలు రాకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టి మూసివేశారు.




