కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
నల్గొండ: పౌరసరఫరాల శాఖలో అవినీతిపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎస్ ఎల్ జీపీ పేరుతో కాంగ్రెస్ నేతలు, డిండి పేరుతో బీఆర్ఎస్ నేతలు మోసం చేశాయని ఆరోపించారు. 590 టీఎంసీలు రావాల్సి ఉంటే.. కేసీఆర్ 290 టీఎంసీలకే ఒప్పుకున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ద్వజమెత్తారు.
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై లో జరిగిందని ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతి బయటపడాలన్నారు. పౌరసరఫరాల శాఖ రూ. 10 వేల కోట్ల నష్టాల్లో ఎందుకు ఉందని బండి ప్రశ్నించారు. రైస్ మిల్లర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయన్నారు. పౌరసరఫరాల శాఖలో అవినీతిపై విచారణ కాళేశ్వరం వలే మిగిలిపోవద్దని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరంలో విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని బండిసంజయ్ ఎద్దేవా చేశారు.






