పాక్‌తో బంగ్లా దోస్తీ!
*వీసా జారీపై నిబంధనల సడలింపు
* భారత్‌కు భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని ఆందోళన
ఢాకా, డిసెంబర్ 13: బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో సంబంధాలను మరింత బలపరచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు భారత్‌కు వ్యతిరేకమైన సంకేతాలు వెలువరిస్తున్నది. దీనిలో భాగంగానే ఇటీవల బంగ్లా ప్రభుత్వం పాకిస్థాన్ పౌరులకు వీసా నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తప్పుబడుతోంది. నిబంధనలు సడలిస్తే పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లు సులభంగా బంగ్లాదేశ్ చేరుకుని, అక్కడి నుంచి భారత్ సరిహద్దులోకి చొరబడతారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నది.
దీనిపై ఇండియన్ ఆర్మీ విశ్రాంత కల్నల్ అజయ్ రైన్ స్పందిస్తూ.. ‘అమెరికా ప్రోద్బలంతోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో దోస్తికి సిద్ధమైంది. బంగ్లాలో పాత ప్రభుత్వం కూలిపోవడానికి కారణం కూడా అమెరికానే. పాకిస్థాన్ పౌరులకు సులభంగా వీసాలు ఇస్తే, బంగ్లాదేశ్ త్వరలో మళ్లీ తూర్పుపాకిస్థాన్ అవతుంది. దీంతో భారత్‌కు భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయి. రెండు దేశాల మధ్య పొడవైన సరిహద్దు ఉంది.. సరిహద్దు నుంచి పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లు, స్మగ్లర్ల బెడద మరింత పెరిగే అవకాశం ఉంది’ అని అభిప్రాయపడ్డారు.
హిందువులపై దాడులు
మతమార్పిడులను ప్రోత్సహిస్తాయి !
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు మాతమార్పిడులకు దారి తీస్తాయని ‘ఇస్కాన్’ కోల్‌కతా ప్రెసెడింట్ రాధారామన్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులను కత్తులతో బెదిరించి, భయపెట్టి మరీ మతం మారేలా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో మతఛాందసవాసులు ఇటీవల ఓ కుటుంబాన్ని బెదిరించారని, దీంతో ఆ కుటుంబానికి చెందిన బాలిక ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి నుంచి పారిపోయిందన్నారు. నది ఈదుకుంటూ భారత్‌కు వైపు వచ్చిందన్నారు. భారత ప్రభుత్వం వెంటనే స్పందించి బాలికతో పాటు ఆమె కుటుంబాన్ని కాపాడి, భద్రత కల్పించేందుకు చొరవ చూపాల న్నారు. మరోవైపు చిన్మయ్‌దాస్ కచ్చితంగా విడుదలవుతారనే నమ్మకముందన్నారు.






