శక్తిమంతమైన మహిళగా కేంద్రమంత్రి నిర్మల
వరుసగా ఆరోసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో చోటు సాధించారు. కాగా వరుసగా ఆరోసారి నిర్మలకు ఈ జాబితాలో చోటు లభించింది. భారత్ నుంచి మొత్తం ముగ్గురు ఈ జాబితాలో స్థానం పొందారు. ఫోర్బ్స్ జాబితాలో గతేడాది 32వ స్థానంలో ఉన్న నిర్మాలా సీతారామన్ ఈ ఏడాది 28వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హెచ్‌సీఎల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ఈ జాబితాలో 81వ స్థానంలో నిలిచారు.
గతేడాది ఈమె 60వ స్థానంలో ఉన్నారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్ షా తాజా జాబితాలో 82వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. బిలగేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ 8వ స్థానంలో, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మాజీ సతీమణి మెకంజీ స్కాట్ 9వ స్థానంలో నిలిచారు.






