కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్
* రాజ్యాంగాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసేందుకు యత్నించింది
* మాకు లెక్చర్లు ఇచ్చే అర్హత ఆ పార్టీకి లేదు
* లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి విమర్శలు
* బీజేపీ ప్రభుత్వం ఓ నియంతలా వ్యవహరిస్తోందన్న అఖిలేశ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: రాజ్యాంగం ఏ ఒక్కపార్టీ కృషి ఫలితం కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ వడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంట్‌లో రెండు రోజులపాటు ప్రత్యేక చర్చ జరు గుతోంది. ఇందులో భాగంగా లోక్‌సభలో శుక్రవారం జీరో అవర్ ముగిసిన అనంతరం ప్రభుత్వం తరఫున రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడిన ఆయన రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన కొందరి పాత్ర విస్మరణకు గురైందనీ స్వాతంత్య్ర ఉద్యమ పోరాటస్ఫూర్తి నుంచి రాజ్యాంగం ఉద్భవించిందన్నారు.
అప్పుడు రాజ్యాంగాన్ని రూపొం దించేందుకు ఏర్పాటైన కమిటీలో భాగం కాకపోయినా మదన్‌మోహన్ మాలవీయ, లాలా లజ్‌పత్‌రాయ్, భగత్‌సింగ్, వీర్ సావర్కర్ వంటి ప్రముఖులు నిర్మాణ ప్రక్రియలో కీలక పాత్రపోషించారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని హైజాక్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. అంతేకాకుండా ఆ పార్టీ చాలా సార్లు రాజ్యాంగాన్ని అవమానించిందని విమర్శించారు. అందువల్ల రాజ్యాంగంపై తమకు లెక్చర్లు ఇచ్చే అర్హత కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని దుయ్యబట్టారు. రాజ్యాంగానికి సంబంధించిన కాపీని ప్రతిపక్ష నేతలు ఇప్పుడు తమ జేబుళ్లో పెట్టుకుని తిరుగుతున్నారనీ కానీ బీజేపీ మాత్రం రాజ్యాంగా న్ని గౌరవప్రదంగా భావించి నెత్తిన పెట్టుకుందన్నారు.
ప్రధాన నరేంద్రమోదీ నాయకత్వం లో తమ ప్రభుత్వం సభ్‌కా సాథ్, సభ్‌కా వికాస్, సభ్‌కాస్ విశ్వాస్, సభ్‌కా ప్రయాస్ స్ఫూర్తితో భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం పని చేస్తుందని వెల్లడించారు. అంతకుముందు దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్ మ్యాప్‌గా ఉపయోగపడుతోందని పేర్కొన్నా రు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75వ వడిలోకి అడుగుపెట్టిన సంద ర్భంగా సభలోని సభ్యులకు దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ శనివారం ఈ చర్చపై లోక్‌సభలో ముగింపు ప్రసంగం చేయనున్నారు. రాజ్యసభలో ఈ చర్చను హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ప్రారంభించనున్నారు.
ప్రధాని లేకుండా చర్చ ఎలా నిర్వహిస్తారు?
లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోదీ లేకుండా రాజ్యాంగంపై చర్చ జరపడాన్ని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ తప్పుపట్టారు. సభలో ప్రధాని లేకుండా రాజ్యాంగం పై చర్చ ఎలా జరుపుతారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రణాళికలు రూపొందించిందనీ అయితే కోరుకున్నంత మెజార్టీ దక్కకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ హయాంలో వేలది మంది సామాన్యులు దేశం విడిచి వెళ్లిపోయారన్నారు. చాలా మంది భారత పౌర సత్వాన్ని వదులుకున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఓ నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని దుయ్యబట్టారు.
రాజ్యాంగం ప్రమాదంలో ఉంది
ఎన్నికైన వాళ్లు రాజ్యాంగాన్ని పరిరక్షించడం చాలా ముఖ్య మని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను కాంగ్రెస్ ఎంపీ హిబి ఈడెన్ గుర్తు చేశారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆరోపించారు అం బేడ్కర్, నెహ్రూల మధ్య అభిప్రాయ బేధా లు ఉన్నప్పటికీ రాజ్యాంగం కోసం కలిసి పని చేసినట్టు పేర్కొన్నారు. అప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఆర్‌ఎస్ ఎస్ మనుస్మృతిలోని చట్టాలను అమలు చేయాలనుకుంటుందని విమర్శించారు.
యూసీసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది
రిజర్వేషన్ల విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ ఎంపీ జగదాంబికాపా ల్ ఖండించారు. అర్హులైన అభ్యర్థులు రిజర్వేష న్ ఫలాలు అందాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వమే ఈడబ్ల్యూఎస్ కో టాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. యూ నిఫాం సివిల్ కోడ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రాజ్యాంగ పరీక్షల్లో బీజేపీ ఫెయిల్
బీజేపీ ప్రభుత్వం అ న్ని రాజ్యాంగ పరీక్షల్లో ఫెయిల్ అయిందని టీ ఎంసీ ఎంసీ మహువా మోయిత్రా ఆరోపించా రు. మ్రోదీ ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. అయోధ్య తీర్పునకు ముందు శ్రీరాముడిని మొక్కినట్టు మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ వాటిని ఆమె ఖండించారు. రాజ్యాంగాన్ని విగ్రహాలుగా కాకుండా దేవుళ్లుగా ఆరాధించాలని సూచించారు. దివంగత న్యాయమూర్తి బిఎల్ లోయాపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం ఆగ్రమం వ్యక్తం చేసింది.
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని సీపీఐ(ఎం) ఎంపీ ఆర్ సచ్చినానం దం ఆరోపించారు. ఈ రెండూ రాజ్యాంగాన్ని మను స్మృతితో భర్తీ చేయాలనుకుంటున్నాయని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వాలను పడగొడుతోంది
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రా జ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడుతోందని శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ ఆరోపించారు. న్యాయ మూర్తులు కూడా పక్షపాత దోరణితో వ్యవహ రిస్తున్నారని విమర్శించారు. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు రాజకీయ పార్టీల్లో చేరుతున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌తో ఆర్టికల్ 356దుర్వినియోగం
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిందని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో కొనసాగేందుకు 1975లో అ ర్ధరాత్రి ఎమరెన్జీని విధించిందని విమర్శించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతలను జైళ్లలో బంధించారనీ, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని గుర్తు చేశారు.
ఏపీ ప్రజల బలం రాజ్యాంగమే
వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని టీడీ పీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు చెప్పారు. తమ రాష్ట్ర ప్రజలకు రాజ్యాంగమే బలమని పేర్కొన్నారు.
అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని నరేంద్రమోదీలోక్‌సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించడానికి ముందు 2001 డిసెంబర్ 13న పారలమెంట్‌పై దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తదితరులు నివాళులర్పించారు.
రాజ్యాంగం అంటే సంఘ్ బుక్ కాదు
వయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఇటీవలే పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ రాజ్యాంగంపైనే తొలి ప్రసంగం చేశారు. విపక్షాల తరఫున ఆమె రాజ్యాంగపై చర్చను ప్రారంభిస్తూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎప్పుడూ గతం గురించే మాట్లాడుతోందని విమర్శించారు. దేశ ప్రగతి కోసం బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని కోరారు. దేశంలో ఏం జరిగినా నెహ్రూనే కారణమా అని ప్రశ్నించారు. నెహ్రూ పేరును, ఆయన ప్రసంగాలను పుస్తకాల నుంచి తొలగించగలరేమో కానీ స్వాతం త్య్ర పోరాటంలో, జాతి నిర్మాణంలో ఆయన పాత్రను చెరిపేయలేరన్నారు.
రాజ్యాంగం అంటే సంఘ్ బుక్ కాదు.. సంవిధాన్ అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా అదానీని ఉద్దేశిస్తూ ఒకరిని కాపాడటం కోసం 142 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాలతో పోల్చితే మన స్వాతంత్య్ర పోరాటం ప్రత్యేకమైందన్నారు. సత్యం, అహింస పునాదులపైనే పోరాటం చేసినట్టు గుర్తు చేశారు. భారత స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వమ్య గళమనీ దాని నుంచి ఉద్భవించిందే రాజ్యాంగమని పేర్కొన్నారు.
ఇది కేవలం డాక్యుమెంట్ మాత్రమే కాదన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మౌలానా ఆజాద్ వంటి వారు ఎంతో మంది కృషి ఫలితమన్నారు. దేశ ప్రజలను కాపాడే సురక్షా కవచంలా రాజ్యాంగం పని చేస్తుందన్నారు. ఈ కవచాన్ని గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఆరోపించారు. రిజర్వేషన్లను బలహీనపర్చేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. 2017లో జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటనను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల్లో బాధితులకు పోరాడే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పుకొచ్చారు. కాగా, ప్రియాంక గాంధీ స్పీచ్‌పై ఆమె సోదరుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. తన తొలి ప్రసంగం కంటే ప్రియాంక స్పీచ్ చాలా బాగుందని ప్రశంసించారు.






