12-10-2024 01:17:19 AM
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అరించేందుకు సిద్ధమవుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రమే ‘లక్కీ భాస్కర్’. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్ర విశేషాలను పంచుకున్నారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ.. ‘ఇప్పటిదాకా బ్యాంకింగ్ సెక్టార్ మీద మన దేశంలో సరైన సినిమా రాలేదు.
ఆ నేపథ్యంలో 1980 కాలంలో జరిగే కథ ఇది. వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకొని రాసుకున్న కల్పిత కథ. దీనికోసం ఎంతో పరిశోధన చేశా. నా సినిమాల్లో ఇది విభిన్నంగా నిలుస్తుందని భావిస్తున్నా’ అని తెలిపారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “లక్కీభాస్కర్’ చిత్రీకరణ పూర్తయింది.
నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దసరా సినిమాల హడావుడి పూర్తయ్యాక ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాలనే ఇప్పటిదాకా ఆగాం. ఈ నెల 21న ట్రైలర్ విడుదల చేయబోతున్నాం” అని తెలిపారు.