6 June, 2026 | 12:49 PM

ధాన్యం సేకరణలో జాప్యాన్ని సహించేది లేదు

06-06-2026 11:27 AM

కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని, రైతులు తమ పంటను సులభంగా విక్రయించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వరి తూకం, నాణ్యత పరీక్షలు, రికార్డుల నిర్వహణ, చెల్లింపుల ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ కల్లాల్లో ఇంకా ఎంత ధాన్యం ఉంది, తడిచిన ధాన్యం ఉన్నదా, ఇంకా ఎంత కొనుగోలు చేయాల్సి ఉంది వంటి అంశాలపై అధికారులను ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు.

అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. పార్కింగ్, నిర్వహణ, అభివృద్ధి అవకాశాలపై అధికారులతో సమీక్షించి, యువతకు మెరుగైన క్రీడా సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, మున్సిపల్ కమిషనర్ మురళి, తహసిల్దార్ సైదులు సహా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.