24-04-2025 01:55:06 AM
పనులను ప్రారంభించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మకుంటకు సం బంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమయ్యిందన్నారు. బుధవారం రంగనాథ్ బతుకమ్మకుంటను సందర్శించారు. స్థానికుల సమక్షంలో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను ప్రారంభించారు.
చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ కుంట చెరువును పునరుద్ధరిస్తే పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారుతాయన్నారు. పనులకు సహకరించాలని స్థానికులను కోరారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన స్థానికులు అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని కమిషనర్‌కు హామీ ఇచ్చారు.
సీవర్‌క్రాక్ పని తీరు పరిశీలించిన హైడ్రా
మురుగు నీటి పైప్ లైన్లలో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించే సీవర్‌క్రాక్ పని తీరును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రొబోటిక్, వాటర్ జట్ పవర్‌తో నడిచే ఈ పరికరంతో సిల్ట్‌ను తొలగించే విధానం, పనితీరును సచివాలయం ముందున్న డ్రైన్లలో పరీక్షించారు. మురుగు ముప్పు ఉన్న ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటితో పని చేయాలని నిర్ణయించారు. పైప్‌లైన్లలోని మురుగును శభ్రం చేసేందుకు గతంలో హైదరాబాద్ జలమండలి సీవర్‌క్రాక్‌ను వినియోగించినట్లు అజంతా టెక్నో సొల్యూషన్స్ సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ జర్మయ్య తెలిపారు.