24 May, 2026 | 1:09 PM

బైరాన్‌పల్లిలో ప్రసిద్ధ బయ్యన్నగుడులు

21-08-2024 02:30 AM

సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం, బైరాన్‌పల్లి గ్రామంలో పురాతన జైనాలయం ఉంది. ఈ జైనబసది రాష్ట్రకూటులనాటిది. దేవాలయం ఏకకూటం. దేవాలయ పాదవర్గం (గోడలు) రాష్ట్రకూటులకాలంనాటి స్తంభాలు, కుడుల(గవాక్షాలు)లో బొమ్మలున్నాయి. గుడి ప్రవేశద్వారం ఉత్తరాశిమీద మనకు గజలక్ష్మి, కింద జైనమహావీరుని శిల్పం ఉండి కనిపించే ఏకైక జైనబసది. అక్కడ ఉన్న శాసనంమీద కూడా జైనతీర్థంకరుని శిల్పం ఉంటుంది. లోపల శిల్పాలు ధ్వంసం చేయబడ్డాయి.

ఆనవాళ్ళుగా జైనతీర్థంకరుడు మహావీరుని మూడు సింహాలతో అధిష్టానపీఠం, తలపై కనిపించే మూడు పొరల గొడుగు (త్రిస్తరచ్ఛత్రం) అగుపిస్తున్నాయి. ఈ దేవాలయం కాకతీయులకాలంలో శైవాలయంగా మార్చబడ్డట్టు తెలుస్తున్నది. గుడి ముందర కాకతీయశైలి స్తంభాల మహామంటపముంది. గుడిలోపలి విగ్రహాలు, శిల్పాలు అగుపించడం లేదు. రాష్ట్ర కూటులనాటి స్తంభాలు గుడిలోపల, బయట అగుపిస్తున్నాయి.

బైరాన్‌పల్లిలో చాళుక్యులనాటి రెండు శాసనాలు దొరికాయి. శైవాలయంగా మారిన జైనబసది ఉంది. అక్కడే ఒక పురాతనమైన రాష్ట్రకూటులనాటి శిథిల శివాలయం ఉంది. దానిలో ఇపుడు కాకతీయులకాలంనాటి త్రిభంగిమలో నిలబడి ఉన్న చతుర్భుజ భైరవుని విగ్రహం ఉంది. ఢమరుకం, త్రిశూలం, ఖడ్గం రక్తపాత్రలు, శునకం, ఇద్దరు పరిచారకులున్నారు. ఈ గుడిముందర కనిపించే నాగశిల్పాలు రాష్ట్రకూటశైలి విగ్రహాలు. మరో నాలుగు నాగశిల్పాలు కూడా చాళుక్యుల శైలిలో చెక్కినవి. మరికొన్ని విరిగిన నాగశిల్పాలు ఆ ఆవరణలో అగుపిస్తున్నాయి. దీర్ఘచతురస్రాకారపు రాతిపలకమీద చెక్కిన చిన్న హనుమంతుని శిల్పముంది. విరిగిన నల్లరాతి నంది ఇక్కడ శివాలయముందని చెప్పే సాక్ష్యం.

బైరాన్‌పల్లి శాసనాలు

మొదటి బైరాన్‌పల్లి శాసనం: త్రిభువనమల్ల విక్రమాధిత్య- పాలనాకాలంలో విక్రమశకం 32వ సం. సర్వధారిలో(క్రీ.శ.1108) భువనగిరి దండనాయకుడు, ఇద్దరు కరణాలు బెక్కల్లులోని బిట్టకులతిలక జినాలయానికి ప్రతిష్టాకాలంలో ఖండస్ఫుటిత జీర్ణోద్ధరణ కొరకు, బైరాన్‌పల్లిలో బైరమరడ్డి తాను కట్టించిన జైనబసదిలో ఉండే సిరిసేన జైనగురువుకు కాళ్ళు కడిగి చేసిన దానవివరాలు బైరాన్‌పల్లి మొదటి శాసనంలో ఉన్నాయి.

అంతేగాక 24గ్రామాల ప్రభువు నంగునూరుపాలకు డు రేవ నాయధేయుడు, అతని కొడుకు విట్టవంశదీపకుడు కనప్ప పండిగ, అతని కొడుకు జినశాసన దీపకుడు పున్నిగ పేర్కొనబడ్డారు. బెక్కల్లు శాసనంలో రేవరడ్డి కొడుకు చండిరడ్డి అని చెప్పబడ్డది. ఈ భేదం ఎందువల్లనో తెలియదు. బీరసిరి, కేతికబ్బె, బీరనాద, బీరమార్యుడు, ప్రభు పున్న, అంకకాఱుడు, బీఱ, బల్లమపట్ల, రేవిరడ్డి  పేర్లు శాసనంలో చెప్పబడ్డాయి.

రెండో బైరాన్‌పల్లి శాసనంలో బెక్కల్లు పురవరాధీశ్వరుడు మల్లారెడ్డికి ‘శ్రావకాభరణ, సత్యరత్నాకరం, సమ్యక్త్వచూడామణి, బిట్టకుల తిలకాంభోరాశి వార్ధివర్థన చంద్రమ’ వంటి బిరుదులున్నాయి. మల్లారెడ్డికి కుటుంబసహితంగా తాను ప్రతిష్ట చేసిన జినదేవర పూజనిమిత్తం, జైన రుషులకు ఆహారం కొరకు,  యమ, నియమ, స్వాధ్యాయ, ధ్యాన, మౌన, అనుష్టాన, జప, సమాధి శీల సంపన్నుడైన గుణసేన అనే జైనమునికి దానాలు చేశాడని చెప్పబడ్డది.

బైరాన్‌పల్లి మొదటి శాసనం బెక్కల్లులోని జైన బసదికి బిట్టకులతిలక జినాలయమనే పేరున్నదని (కొలనుపాకలో అంబరకులతిలక జినాలయం వలె) పున్నిగ వరకు రేవరడ్డి వంశక్రమం వివరం ఉంది.  బైరాన్‌పల్లి రెండవ శాసనం బెక్కల్లు పురవరాధీశ్వరుడు మల్లారెడ్డి అని, తనకున్న జైనమత బిరుదగద్యలు తెలిపింది. జైనమునులు యమ, నియమాదులను ఆచరిం చేవారని కూడా తెలుస్తున్నది. బెక్కల్లు శాసనంలో ఒకవైపు తాత మల్లారెడ్డి, మరొకవైపు మనవడు మల్లారెడ్డిల శాసనాలున్నాయి. ఇద్దరొకటేనని చరిత్రకారులు రాశా రు. కానీ వారి కాలాలు వేరు, శాసన ప్రస్తావనలు వేరు.